శాసన సభలో అడుగుపెట్టేందుకు మొహం చెల్లిన మాజీ సీఎం జగన్ ఏవేవో కారణాలు చెప్పి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొడుతున్నారు. గత సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ధర్నా అంటూ రచ్చ చేసిన జగన్..ఈ సారి మీడియా ముందే అసెంబ్లీ పెడతానంటూ మరోసారి శాసన సభకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ, జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ పై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేని జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ తో పాటు అసెంబ్లీకి రాని మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని షర్మిల చెప్పారు.
మరోవైపు, శాసన సభకు రాని జగన్కు రాజకీయ పార్టీ ఎందుకని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ప్రశ్నించారు. పులివెందులలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయని జగన్ కు జీతమెందుకని, తన పదవికి జగన్ రాజీనామా చేస్తే వేరే ఎమ్మెల్యే పులివెందులకు వస్తారని అన్నారు. అసెంబ్లీకి రాకుండా పారిపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.