సజ్జల భార్గవ రెడ్డి ని తక్షణమే అరెస్టు చేయాలని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియాను సంస్కరించే దిశగా కూటమి ప్రభుత్వం వేస్తున్న అడుగులను ఆమె హర్షించారు. ఇది మంచి పనేనని వ్యాఖ్యానించారు. అయితే.. సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెట్టిన వారికి సహకరించిన వారిని పోలీసులు ఎందుకు ప్రశ్నించడం లేని షర్మిల నిలదీశారు.
“అరెస్టు చేస్తున్నారు బాగానే ఉంది. కానీ, పట్టుబడుతున్న వారి వెనుక ఉన్న అసలు నేరస్తులను ఎందుకు ప్రశ్నించడం లేదు“ అని షర్మిల ప్రశ్నించారు. వైసీసీ సోషల్ మీడియాకు హెడ్‌గా వ్యవహరించి న సజ్జల భార్గవ్ ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించారు. తక్షణమే ఆయనను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయిస్తున్న పెద్ద తలకాయలపై ముందు చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలోని 33శాతం మహిళలు అసెంబ్లీలో ఉండాలని నిత్యం చెప్పే వారే(జగన్) మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్య ప్రచారం చేయడం దుర్మార్గమని షర్మిల పేర్కొన్నారు. అసభ్య పోస్టులు పెట్టే వారిపైనే కాకుండా వారితో ఆ పని చేయించే వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నా రు. “తిమింగలాలను వదిలేసి పిల్ల చేపలను అరెస్టు చేస్తున్నారు“ అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. వివేకా హత్య కేసులో తన సోదరి సునీతకు అండగా ఉంటానని షర్మిల పేర్కొన్నారు. తన బాబాయి వివేకా హత్య కేసులో అసలు దోషులెవరో కనిపెట్టి శిక్షించాలని ఆమె కోరుతున్నట్టు తెలిపారు.