వైసీపీ అధినేత జగన్ కు సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల గట్టి సవాల్ రువ్వారు. పారిశ్రామిక వేత్త అదానీ నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని బైబిల్‌పై ప్రమాణం చేస్తావా? అని ఛాలెంజ్ చేశారు. అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. గురువారం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
“2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, తమరు రూ 2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా?“ అని షర్మిల ప్రశ్నించారు. అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే అదానీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా? అని నిలదీశారు.
అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాలేదని, కానీ, జగన్ మాత్రం ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా? అని జగన్ ను ప్రశ్నించారు.
ట్రాన్స్ మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే .. గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదన్నారు. మీ హయాంలోనే ట్రాన్స్ మిషన్ చార్జీలు పడ్డాయని ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా అని ప్రశ్నించారు.
ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం ఎందుకన్నారు. దమ్ముం టే జగన్ సమాధానం చెప్పాలని షర్మిల వ్యాఖ్యానించారు. “అదానీ కలవడం ఒక చరిత్ర. రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్ర. ఎవరూ కొనేందుకు ముందుకు రాని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్ర. గంటల్లోనే క్యాబినెట్ భేటీ నిర్వహించడం చరిత్ర. ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర“ అనిషర్మిల ఎద్దేవా చేశారు.