ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, తన సోదరి వైఎస్ షర్మిల పై సీఎం జగన్ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల రాజకీయ కాంక్ష వల్లే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు వచ్చాయని జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. మనిద్దరం నమ్మే బైబిల్ మీద ఒట్టేద్దాం..అందుకు రెడీనా అని జగన్ కు సవాల్ విసిరారు షర్మిల.
తనకు రాజకీయ కాంక్ష, డబ్బు కాంక్ష లేవని, ఒక్క పదవి కూడా ఆశించకుండా జగన్ కోసం పనిచేశానని తాను చెప్పగలనని షర్మిల అన్నారు. అదే బైబిల్ మీద ప్రమాణం చేసి తాను పదవి అడిగినట్లుగా జగన్ చెప్పగలరా, తనకు రాజకీయ కాంక్ష, డబ్బు కాక్ష ఉందని నిరూపించగలరా అంటూ జగన్ ను షర్మిల ఛాలెంజ్ చేశారు. మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించగలిగిన రాజశేఖర్ రెడ్డి గారి గుణం జగన్ కు ఎందుకు రాలేదని షర్మిల కన్నీటిపర్యంతమయ్యారు.
తనను రాజకీయాలలోకి తీసుకువచ్చింది ఎవరూ అంటూ జగన్ ను షర్మిల సూటిగా ప్రశ్నించారు. జగన్ అరెస్ట్ అయిన తర్వాత 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వచ్చిన ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని తనను కోరింది కూడా జగన్ కాదా అని నిలదీశారు. చంద్రబాబు పాదయాత్రకు పోటీగా పాదయాత్ర చేయాలని తనని కోరింది జగన్ అని, బై బై బాబు ప్రచారం కోసం ఉపయోగించుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ అవసరాల కోసమే తనను రాజకీయాలలోకి తెచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు.
తనకు రాజకీయ కాంక్ష ఉంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని హస్తగతం చేసుకుని ఉండేదాన్ని కదా అని ప్రశ్నించారు. తన కాలికి దెబ్బ తగిలితే ఫిజియోథెరపీ చేయించుకుని మరీ ప్రచారం చేశానని, పిల్లలను, కుటుంబాన్ని కూడా వదిలేసి రోడ్ల వెంబడి నెలల తరబడి తిరిగానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయ కాంక్ష, డబ్బు కాంక్ష ఉంటే కోరిన పదవిని ముందుగా పొందగలిగే దానినని గుర్తు చేసుకున్నారు.