ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పిచ్చి ముదిరిందో లేక మొదలైందో అర్థం కావడం లేదు. నిజానికి జగన్ తెలివి తక్కువేమీ కాదు. కానీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆ తెలివిని వాడటం మానేశారా అన్న అనుమానం రాకమానదు. జగన్ తీసుకున్న తాజా నిర్ణయం అందుకు నిదర్శనం. రాజకీయ నాయకులు ప్రమాద బాధితులను పరామర్శించడం అనేది సర్వసాధారణం. కానీ జగన్ మాత్రం తన రూటు సపరేటు అంటున్నారు. ఏకంగా కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసిన ముగ్గురు రౌడీ షీటర్లను పరామర్శించేందుకు జగన్ నేడు తెనాలికి వస్తున్నారు.
ఐతానగర్ లో ఇటీవల ముగ్గురు యువకులకు పోలీసులు ఓపెన్ లాఠీ ట్రీట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ ముగ్గురు వ్యక్తులు తక్కువారేం కాదు. ఒక్కొక్కరిపై తెనాలిలో పదికి పైగా కేసులు ఉన్నాయి. అమాయకులను వేధిస్తూ, దౌచార్ణాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్లు. పోలీసులు ఎన్నిసార్లు మందలించిన, కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన.. బెయిల్‌పై వచ్చి మళ్ళీ అరాచకాలకే పాల్పడుతున్నారు. ఇటీవల చిరంజీవి అనే కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈసారి ఆ ముగ్గురు రౌడీషీటర్లకు గట్టి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బహిరంగంగా లాఠీలతో అరికాళ్ళపై కొట్టారు. పోలీసుల తీరు పట్ల జనం హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐతానగర్ వాసులు తెగ సంబరపడ్డారు. కానీ వైసీపీ మాత్రం పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందంటూ గగ్గోలు పెడుతోంది. అక్కడితో ఆగకుండా దళిత కార్డు పట్టుకొని ఆ ముగ్గురిని పరామర్శించేందుకు రెడీ అయ్యారు జగన్. నిజానికి పోలీసులు బహిరంగంగా అలా కొట్టడం అనేది చట్టవిరుద్ధమే.. కాబట్టి జగన్ దాన్ని ఖండించి ఉంటే సరిపోయేది. అలా కాకుండా కులం రంగు పులుముతూ వారిని పరామర్శించేందుకు వెళ్లడం పట్ల సార్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు జగన్ ఇటువంటి చర్యతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అంటూ ప్రజలు ప్రశిస్తున్నారు. ఎన్ని క్రైమ్‌లు, మరెన్ని అరాచకాలైనా చేసుకోండి.. మీకు నేనున్నా అంటూ రౌడీలకు జగన్ భరోసా కల్పిస్తే సామాన్య ప్రజలు ఎలా ప్రశాంతగా బ్రతకగలరు? అని మండిపడుతున్నారు. మొత్తంగా నేడు తెనాలిలో రౌడీషీటర్లను పరామర్శించడంతో జగన్ ఇమేజ్ మొత్తం మటాషే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.