జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి.. ఆయన రాజకీయ ఎత్తుల గురించి.. ఆయనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. జగన్ ఏ పార్టీతో ఎలా ఉండాలి? ఎవరితో ఎంత క్లోజ్ గా ఉండాలి? ఎవరితో గొడవలు పడాలి? ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి? ఎవరితో పెట్టుకోకూడదు? లాంటి సలహాలు.. సూచనలు ఎవరూ ఇవ్వట్లేదే? అలాంటప్పుడు జనసేన అధినేతకు జగన్ అండ్ కో ఎందుకు ఇస్తున్నట్లు? అంటే.. వారి ప్రయోజనాల్ని కాపాడటమే తప్పించి పవన్ కు మరింకేమీ పని ఉండకూడదా? అన్నది ప్రశ్న.
ఏ మాత్రం సంబంధం లేని అంశాన్ని.. అదే పనిగా ప్రస్తావిస్తూ.. వ్యక్తిత్వాన్ని కుట్రపూరితంగా దెబ్బ తీసే వారి విషయంలో ఆవేశం పనికి రాదా? కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే వారిని.. తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. నా కొడకల్లారా? అంటూ నిలదీయటం తప్పు అవుతుంది. మంచోడికి మంచిగా చెబితే సరిపోతుంది. తేడాగా వ్యవహరించే వారికి అంతే తేడాగా చెప్పాల్సిన అవసరం లేదా? అన్నది ప్రశ్న.
తనను ఉద్దేశించి అదే పనిగా పనికి మాలిన వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతల్ని (అంత ఆగ్రహంలోనూ తాను అనేది కొందరు వైసీపీ కొడుకుల్ని మాత్రమే అనేంత సంస్కారం పవన్ సొంతమని చెప్పాలి) ఉద్దేశించి చెప్పుతో కొడతానని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు.. ఏపీకి చెందిన కొందరు మేధావి మర్యాదస్తులకు ఒక్కసారిగా.. రాజకీయాలు ఏమిటి? ఇంత చిల్లరగా మారాయి? అలా అనేస్తారా? చెప్పు చూపిస్తారా? లాంటివెన్నోకనిపించాయి.
అలాంటి మర్యాదస్తులకు జనసేన అధినేతను ఉద్దేశించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అధినేత నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఎందుకు కనిపించదు. పవన్ ను ఉద్దేశించి.. ఆయన వ్యక్తిగత విషయాల్ని అలా ఎలా ప్రస్తావిస్తారు? లాంటి ప్రశ్నల్ని ఎందుకు సంధించరు? జగన్ అండ్ కో మాట్లాడినప్పుడు నోటి నుంచి ఒక్క మాట రావటానికి సైతం ఇష్టపడని వారు.. తనను అదే పనిగా వ్యక్తిత్వ హననం చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చే పవన్ కు సుద్దులు చెప్పటానికి సిద్ధం కావటం ఎంతవరకు మర్యాద? మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించిన జగన్ చేసిన వ్యాఖ్యలు హుందాతనానికి అనుగుణంగా ఉన్నాయా? ముఖ్యమంత్రి హోదాకు గౌరవాన్ని ఇచ్చేలా ఉన్నాయా? అన్ని ప్రశ్న. మరి.. దీనికి మేధావి మర్యాదస్తులు ఏమంటారు?