మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయాడు, కూటమికి అమ్ముడుపోయాడు అంటూ తాజాగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు ఫ్యాన్ పార్టీలో నెంబర్ 2 గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి.. గత ఎన్నికల తర్వాత అనూహ్యంగా తన రాజ్యసభ సభ్యత్వానికి మరియు వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ విజయసాయిరెడ్డి పలు ఆరోపణలు గుప్పించారు. అలాగే ఒకదశలో ఆయన బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
అదలా ఉంటే.. గురువారం తాడేపల్లిలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏడాది పాలనను జగన్ దయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, సంక్షేమ కనుమరుగై పోయిందంటూ విమర్శించారు. లిక్కర్, ఇసుక, మైనింగ్‌లో భారీగా మాఫియా జరుగుతుందని ఆరోపణలు చేశారు. అలాగే ఇదే ప్రెస్ మీట్ లో విజయ సాయి రెడ్డి పై కూడా జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయ సాయి రెడ్డి అంటూ జగన్ విమర్శలు గుప్పించారు.
`రాజ్యసభ సభ్యుడుగా మూడున్నర సంవత్సరాల టర్మ్ ఉండగానే చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదు.. మళ్లీ రాజ్యసభకు వైసీపీ పంపే అవకాశం ఉండదు అని తెలిసి, తన రాజీనామా వల్ల చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి.. తను మూడున్నర సంవత్సరాల టర్మ్ ప్రలోభాలకు లొంగిపోయి కూటమికి అమ్ముకున్నాడు. అలాంటి వాడు చేసిన ఆరోపణకు విలువ ఏమంటుంది` అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశగా మారాయి. మరి జగన్ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.