అవును.. పాడు రోజులు వచ్చాయి. ఊహకు అందని ఎన్నో విషయాల్ని వాస్తవంలోకి తెచ్చిన కరోనా.. ఇప్పుడు అంతకు మించిన దారుణమైన పరిస్థితుల్ని తెచ్చేశాయి. ఓవైపు పాలకులు.. మరోవైపు ప్రజలు ఎవరికి వారుగా.. చేయాల్సిన తప్పుల్ని చేసేసి.. కరోనాకు భారీగా అవకాశం ఇచ్చేసిన నేపథ్యంలో.. కేసుల తీవ్రత భారీగా నమోదవుతోంది. దీంతో.. ఇప్పుడు ఇల్లు కూడా కరోనాకు మినహాయింపు కాదన్నట్లుగా పరిస్థితి మారిందని చెప్పాలి. కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోయిన నేపథ్యంలో తాజాగా దేశంలో 2.16లక్షల కేసులు ఒక్కరోజులో నమోదయ్యాయి.
రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖఱ్య మరింత పెరగనుంది.రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కేసుల సంఖ్య అధికారికంగా తక్కువగా వెల్లడిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. అయినప్పటికి వాస్తవ గణాంకాలు మాత్రం బయటకు రావటం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పెరుగుతున్న కేసుల కారణంగా ఊహకు అందని దారుణ పరిస్థితులు మొదలైనట్లుగా చెబుతున్నారు. కరోనా తీవ్రత భారీ స్థాయిలో ఉన్నందున రాష్ట్రంలోని వారంతా ఇంట్లో ఉన్నప్పటికి ముఖానికి మాస్కు పెట్టుకోవటం మర్చిపోవద్దంటున్నారు.
గతంలో ఒక వ్యక్తికి కరోనా సోకితే.. అతనికే పరిమితం అయ్యేదని.. కానీ ప్రస్తుత వైరస్ తీవ్రత కారణంగా ఇంట్లో ఒకరికి సోకితే.. గంటల వ్యవధిలోనే ఇంట్లోలోని వారికి గాలి ద్వారా వ్యాప్తి చెందే పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఇంట్లో ఉన్న వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే.. కుటుంబ సభ్యులందరికి ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. ఇంట్లో ఎవరైనా కరోనా పాజిటివ్ కేసు ఉంటే.. ఇంట్లోనివారంతా ముఖానికి మాస్కుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే వీలుందని.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉందని వైద్య శాఖకు చెందిన పలువురు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అందుకే.. ఇంట్లో ఉన్నప్పటికి.. కుటుంబ సభ్యులతో మాట్లాడే వేళలో ముఖానికి మాస్కు పెట్టుకోవాలన్నారు. వైరస్ వ్యవధి నాలుగైదు వారాలు పెరిగే వీలుందని.. అప్పటివరకుజాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. రానున్న ఆరు వారాల పాటు కేసుల నమోదు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రభుత్వ దవాఖానాలో పడకల కొరత ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే పరిస్థితి ఇబ్బందిగా మారుతున్నప్పుడు.. సరదాగా కాఫీ మొదలు మరెక్కడికి వెళ్లే పరిస్థితి పెట్టుకోకూడదు. ఎంతో అవసరమైతే తప్పించి.. ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పటికి ముఖానికి మాస్కు పెట్టుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడే పాడు కాలాన్ని కరోనా తీసుకొచ్చేసిందని చెప్పాలి.