సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పాలనను, హామీలు నెరవేర్చకుండా కాలం వెళ్లదీస్తున్న జగన్ ను రఘురామ దుయ్యబడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై రఘురామ మరోసారి తన పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అమరావతి రైతులను జగన్ సర్వనాశనం చేశారని నిప్పులు చెరిగారు. అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, గంజాయి, అప్పుల్లో ఏపీని దేశంలో నెంబర్ వన్ గా నిలిపిన ఘనుడు జగన్ అని ,జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని రఘురామ సెటైర్లు వేశారు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని, ఎందుకో చెప్పాలని కోర్టు అడిగితే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వింత సమాధానమిచ్చారని ఎద్దేవా చేశారు. తన తండ్రి కూడా ఉపాధ్యాయుడేనని, తన చిన్నతనంలో ఆయనకు కూడా 3 నెలలు జీతాలు రాలేదని జవహర్ రెడ్డి అన్న మాటలకు రఘురామ కౌంటర్ ఇచ్చారు. జవహర్ రెడ్డి చిన్నతనం అంటే 50 ఏళ్ల కిందటే కదా, జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్రం 50 ఏళ్ల వెనక్కి వెళ్లినట్టే కదా అంటూ సెటైర్లు వేశారు.
ఇక, జీతాలు ఇవ్వడం చేతగాని వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ దారుణ పరిస్థితిని మంత్రి బొత్స సమర్థించుకోవడం సిగ్గుచేటని రఘురామ దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ప్రభంజనం కొనసాగుతోందనడానికి చంద్రబాబు రోడ్ షోలకు పోటెత్తుతున్న జనమే నిదర్శనమని ఆయన ప్రశంసించారు. ఉత్తరాంధ్రలో మరో 2 రోజులు ఈ పసుపు తుఫాను కొనసాగనుందని రఘురామ అన్నారు. ఇక, విశాఖలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తే జన సునామీ వెల్లువెత్తే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. కానీ, ఈసారి చంద్రబాబు పర్యటన విశాఖలో లేదన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 26న హైదరాబాదులోని తన ఎమ్మార్ నివాసం వద్ద ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి కాపు కాశారని, ఇతరుల ఇళ్ల దగ్గర నిఘా అంటే తన ఇంటి గేటు ముందు పోలీసులు కాపు కాయడమా అని ప్రశ్నించారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ, వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.