2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ ఓటమి ఖాయమని ఐ ప్యాక్ మాజీ బాస్, మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి వైసీపీ ఓటమిపై రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు. మే 13న వైసీపీ చనిపోయిందని, ఆ రోజు ప్రజలు వైసీపీని తిరస్కరించారని అన్నారు.
జూన్ 4వ తేదీన జగన్ దిమ్మతిరిగిపోయే ఫలితాలు రాబోతున్నాయని, జూన్ 4న వైసీపీకి పెద్దకర్మ అని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు రిటర్న్ గిఫ్ట్ తప్పదని, ఫలితాలు చూసి వైసీపీకి ఆ రోజు పెద్దకర్మ నిర్వహించాల్సి ఉంటుందని ఆయన సెటైర్లు వేశారు. గత ప్రభుత్వ హయాంలో తనకు నరకం చూపించారని, తాను పుట్టి పెరిగిన ఊరికి వచ్చేందుకు నాలుగేళ్ల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ లో ఓ ఉన్మాది ఉన్నాడని, చివరకు హైదరాబాద్ లో తనను అరెస్ట్ చేయించారని విమర్శించారు. జగన్ కొందరు నేతలను టార్గెట్ చేశారని, తనతోపాటు చాలామందిని, ఆఖరికి అశోక్ గజపతిరాజు వంటి సౌమ్యుడిని కూడా జగన్ వేధించారని ఆరోపించారు. జగన్ ప్రమాణ స్వీకారం వైజాగ్ పిచ్చాసుపత్రిలో జరుగుతుందని ఎద్దేవా చేశారు. జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం కూడా ప్రకటించారని, ఆ ముహూర్తానికి వైసీపీ భూస్థాపితం అవుతుందని చెప్పారు.