వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న వైసీపీ వ్యక్తుల కేంద్రంగా దూకుడు ప్రదర్శిస్తున్న పరిస్థితి రోజు రోజుకు పెరుగుతోంది. అయితే.. ఈ దూకుడు ఓట్లు ఏమేరకు రాలుస్తుందనేది ఆసక్తిగా మారింది. మంత్రులు, నాయకుల మాట ఎలా ఉన్నా.. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కూడా వ్యక్తులు కేంద్రంగా విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఈనాడు అధిపతి రామోజీ, టీడీపీ అధిపతి చంద్రబాబు, జనసేన అధిపతి పవన్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు.
తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్.. వీరిపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వ్యక్తి కేంద్రంగా పవన్‌ను ఆయన టార్గెట్ చేశారు. తనకు కేంద్ర ఇంటిలిజెన్స్ నుంచి సమాచారం ఉందన్న పవన్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. వలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..వలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్ట్ రామోజీరావు రాస్తున్నారని అన్నారు.
దీనికి నిర్మాతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక, ప్రజల నుంచి నటించేందుకు దత్తపుత్రుడు (పవన్) వచ్చాడని ఎద్దేవా చేశారు. అయితే.. తాజాగా జగన్ అయినా.. ఆయా జిల్లాల్లో వైసీపీ నాయకులైనా చేస్తున్న విమర్శలన్నీ వ్యక్తిగతంగా ఉన్నవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవి ఏమేరకు ఓటు బ్యాంకుగా మారుతాయనే చర్చ తెరమీదకి వస్తోంది.
ఎందుకంటే.. ఎవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుంది. రాజకీయంగా వ్యూహాలు కూడా ఉంటాయి. అసలు వ్యూహాలే లేకపోతేరాజకీయమే లేదు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎదుర్కొనేందుకు వైసీపీ కూడా వారి వ్యూహాలు, సిద్ధాంతాలను టార్గెట్ చేయడం మంచిదనే వాదన బలంగా వినిపిస్తోంది. కేవలం వ్యక్తిగతంగా టార్గెట్ చేసినంత మాత్రాన ప్రయోజనం లేదని కూడా చెబుతున్నారు.