వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా 8వ జాబితా విడుదల చేసింది. మొత్తం ఐదుగురు నేతలకు ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు 2 పార్లమెంటు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు మార్పులు చేర్పులు పోను 8వ లిస్టుతో కలిపి దాదాపు 72 స్థానాలు ప్రకటించారు. 17 ఎంపీ స్థానాలు ప్రకటించినట్లయింది.
గుంటూరు ఎంపీ స్థానానికి కిలారు రోశయ్య, ఒంగోలు ఎంపీ సీటు బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించిన జగన్.. అసెంబ్లీ విషయానికొస్తే పొన్నూరు నుంచి అంబటి మురళి, కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, గంగాధర నెల్లూరు స్థానానికి కల్లత్తూర్ కృపాలక్ష్మికి సమన్వయ కర్తగా బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటి వరకు..
ఇంఛార్జ్‌ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ నిర్ణయించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. 8వ జాబితాలో 2 పార్లమెంట్, 3 అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జ్‌లను నియమించారు.
సకుటుంబ సపరివార 8వ జాబితా!
+ గుంటూరు ఎంపీ – కిలారు రోశయ్య(మండలి పక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు)
+ పొన్నూరు – అంబటి మురళి(మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు)
+ ఒంగోలు ఎంపీ – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(ఈయన కుమారుడు మోహిత్‌కు చంద్రగిరి టికెట్ ఇచ్చారు)
+ కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్
+ జి.డి. నెల్లూరు – కల్లత్తూర్ కృపాలక్ష్మి(మంత్రి నారాయణస్వామి కుమార్తె)