ఏపీలో వైసీపీ పరిస్థితి చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు. వైసీపీ పరిస్థితి బాగుందనే వారు కూడా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించాక.. గుడ్లు తేలేస్తున్నారు. తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చేపట్టిన కార్యక్రమానికి వైసీపీ నాయకురాలు.. హారతిపట్టి.. బొట్టుపెట్టి.. స్వాగతించడం.. సంచల నంగా మారింది. అంతేకాదు.. సహకరిస్తానని కూడా సదరు మహిళా నేత చెప్పడం.. రాజకీయాల్లో సంచల నం సృష్టిస్తోంది.
ఏం జరిగింది? ఎక్కడ జరిగింది?
టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలో నాయకులు `ఇదేం ఖర్మ` కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నారు. ఇలా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో వారంతా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. తణుకు పట్టణంలోని 26, 30 వార్డులో రాధాకృష్ణ ఎంట్రీ ఇవ్వగానే ఒక చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడో టీడీపీని వీడి వైసీపీ చెంతకు చేరిన మహిళా నాయకురాలు(ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధి) హారతి పట్టారు. అంతే.. ఒక్కసారిగా టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు.
ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగినప్పుడు.. అక్కడక్కడ మహిళలు హారతి ఇవ్వడం తెలిసిందే. ఏ పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు వస్తే.. ఆ పార్టీకి చెందిన అభిమానులు కార్యకర్తల కుటుంబాలకు చెందిన మహిళలు సర్వసాధారణంగా హారతి ఇస్తారు. ఆరిమిల్లి రాధాకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైసీపీ నాయకురాలు వావిలాల సరళాదేవి హారతి ఇచ్చి నుదుటన బొట్టు పెట్టి స్వాగతించారు.
ఆమె స్వాగతానికి రాధాకృష్ణతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనయ్యారు. వావిలాల సరళాదేవి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేశారు. వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో చేరిన తర్వాత కూడా టీడీపీ నాయకులను ఆమె విమర్శించారు. అలాంటి ఇప్పుడు ఆమె ఘన స్వాగతం పలకటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆమె మనసు మార్చుకున్నారా? టీడీపీలోకి వచ్చేస్తున్నారా? అనేచర్చ కూడా జరుగుతోంది. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.