గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. మొన్న కందుకూరు, నిన్న గుంటూరు సభల సందర్భంగా అమాయకులు చనిపోయారని, చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఇలా జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కందుకూరు ఘటన వెనుక కుట్రకోణం ఉండొచ్చంటూ పలువురు టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు.
కందుకూరు ఘటన వెనుక కుట్ర కోణం ఉండొచ్చని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇక,గుంటూరు ఘటనకు ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమే కారణమని ఆయన ఆరోపణలు చేశారు. వేలాదిమందితో సభ నిర్వహణకు అనుమతిచ్చిన పోలీసులు కనీసం వంద మంది పోలీసులను కూడా నియమించలేదని అచ్చెన్న విమర్శించారు. తోపులాట సమయంలో పోలీసులు సరిగా స్పందించలేదని, ఘటన జరిగిన వెంటనే మంత్రులు అక్కడకు క్యూ కట్టడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.
ఈ తొక్కిసలాట ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. అసలు రాజకీయం జనవరి నుంచి చూస్తారని నవంబరు 20న జగనన్న సైన్యం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును ఉమ గుర్తు చేశారు. నిన్నటి ఘటనకు ఆ పోస్టుకు సంబంధం ఉందని ఉమ ఆరోపించారు. పోలీసుల అనుమతితోనే ఆ కార్యక్రమాన్ని ఓ ఎన్నారై చేపట్టారని, పోలీసులు ముందుగానే వచ్చి స్థలాన్ని పరిశీలించారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు.
పోలీసులు పరిశీలించిన అనంతరం ఈ దుర్ఘటన ఎలా జరిగిందని వర్ల ప్రశ్నించారు. ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా? లేక చంపేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. జగన్, వైసీపీ నేతలు కలిసి ఆ ముగ్గురిని చంపేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతున్నారని, అది చూసి ఓర్చుకోలేక ఈ తరహా పనులను వైసీపీ స్లీపర్ సెల్స్ చేస్తున్నాయని ఆరోపించారు. కాగా, తొక్కిసలాటలు జరిగేలా చేసి చంద్రబాబును కారకుడిగా చేస్తున్నారని, ‘చనిపోలేదు… చంపేశారు’ అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ ట్వీట్ చేసింది.