ఏపీలో కరోనా విలయతాండవం చేయడానికి జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు పెట్టిన చాలా రోజులకు జగన్ మేల్కొని ఏపీలో నైట్ కర్ఫ్యూ, తాజాగా 18 గంటల కర్ఫ్యూ విధించారని మండిపడుతున్నారు. ఇక, ఇంటర్ పరీక్షల వాయిదాపై మంకుపట్టు పట్టిన జగన్….హైకోర్టు మొట్టికాయలు వేస్తేగానీ దిగిరాలేదని అంతా అనుకుంటున్నారు. అయితే, జగన్ కరోనా కట్టడిలో విఫలమయ్యాడని టీడీపీ నేతలే కాదు…స్వయానా ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక వీడియో లీక్ కావడంతో జగన్ గుట్టు రట్టయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరోనాపై జగన్ చేతులెత్తేశారంటూ వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ నెల 3న రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ నివాసంలో ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ కోఆర్డినేటర్ రౌతు సూర్య ప్రకాష్ రావు సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఏపీలో కరోనా పరిస్థితులపై వారు మనసు విప్పి మాట్లాడుకున్నారు. కరోనా మృతదేహాలను తరలించడానికి రూ. 30 వేలు, దహనసంస్కారాలకు రూ. 12 వేలు తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలు అంత్యక్రియలకూ ఇబ్బందిపడుతున్నారని మాట్లాడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన జగన్ ఏమి చేశాడు బొక్క…. చేతులెత్తేశారంటూ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది.
జగన్ గవర్నమెంట్ చేతులెత్తేసిందంటూ వైసీపీ నేత ఆకుల సత్యనారాయణ వ్యాఖ్యానించారు. జగన్ అసమర్థ పాలనపై వైసీపీ నాయకులు స్వయంగా మాట్లాడుకుంటున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి, ఈ వ్యవహారంపై జగన్ అండ్ కో ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.