ఏపీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు దరిమిలా.. టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు, సవాళ్లు పేలుతున్నాయి. ఇక, సాధారణంగా బయట మీడియా ముందు.. నానా మాటలు అనేసుకుంటున్నారు. ఇందులో వైసీపీ నాయకుల దూకుడు మరింత ఎక్కువగా ఉందనే చర్చ కూడా ఉంది.
అయితే, బయట ఎలా మాట్లాడుకున్నా.. ఎలాంటి విమర్శలు చేసుకున్నా.. ఇరు పక్షాల రాజకీయం అనుకుని సరిపుచ్చుకోవచ్చు. కానీ, భారత ప్రతిష్టకు ఆనవాలంగా నిలిచిన పార్లమెంటులోనూ.. టీడీపీ ఎంపీలపై వైసీపీ ఎంపీలు.. నోరు చేసుకుంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కనీసం తాము మాట్లాడుతున్న మాటలు.. రికార్డు అవుతాయనే విషయాన్ని కూడా వారు మరిచిపోతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు లోక్‌సభలో లేవనెత్తారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. అనంతరం.. మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. ఎంపీ రామ్మోహన్నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతుండగా.. జోక్యం చేసుకున్న రామ్మోహన్‌పై వైసీపీ రాజమండ్రి ఎంపీ భరత్, సహా మిథున్‌రెడ్డిలు అరెయ్.. ఒరెయ్.. అంటూ సభలోనే విరుచుకుపడ్డారు.
“నువ్వు మాట్లాడింది చాలు కూర్చో రా!“ “నువ్వు కూర్చోరా!“ “ఒరేయ్ మూసుకో“- అంటూ ఇద్దరు ఎంపీలు రామ్మోహన్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్లమెంటు రికార్డులో స్పష్టంగా వినిపించాయి. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన పార్లమెంటులోనూ వైసీపీ సభ్యులు ఇంత దిగజారిపోతారా? అంటూ.. దుయ్యబడుతున్నారు.