వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ వైసీపీ లో అంతర్గత విభేదాలు ఎక్కడా చల్లారడం లేదు. దాదాపు 25 నియోజకవర్గాల్లో అసంతృప్త నాయకులు సొంత పార్టీలో నే సెగ పెడుతున్నారు. సొంత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సెల్ఫ్ డిఫెన్స్‌లో పడుతున్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు అధిష్టానం ఎంతో ప్రయత్ని స్తున్నా ఫలితం అయితే కనిపించడం లేదని అంటున్నారు.
ఉదాహరణకు విశాఖ, విజయనగరం, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి చిత్తూరు సహా పలు జిల్లాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. విశాఖలో టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి జై కొట్టిన వాసు పల్లి గణేష్‌ను ఇంకా స్థానిక నాయకులు ఓన్ చేసుకోకపోగా.. ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్‌ను ఆశిస్తున్న సీతంరాజు సత్యనారాయణ సహా మరో ఇద్దరు నాయకులు వేర్వేరుగా రాజకీయాలు చేస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశంలోని గూడూరు నియోజకవర్గంలోనూ టికెట్ ఆశిస్తున్న యువ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే వృద్ధుడు అయిపోయాడని, మతి భ్రమించిందనే ప్రచారం చేస్తున్నారు. దీనిని దీటుగా ఎదుర్కొనలేక.. సదరు ఎమ్మెల్యే చేతులు ఎత్తేస్తుండడంతో దీనిని ప్రతిపక్ష నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇదే నియోజకవర్గంలోని గిద్దలూరులోనూ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై రెడ్డి సామాజిక వర్గం నిప్పులు చెరుగుతోంది.
ఇక, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోనూ రోజాకు వ్యతిరేకత మరింత పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు కేజే కుమార్ వర్గం మాత్రమే ఆమెకు వ్యతిరేకంగా చక్రం తిప్పగా.. ఇప్పుడు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి కూడా ఆమెపై ఎగస్పార్టీ జెండా ఎగరేస్తున్నారు. అదేసమయంలో కీలకమైన విజయనగరం జిల్లాలోనూ ఒకే నియోజకవర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు ఎవరికి వారుగా పోటీకి రెడీ అవుతున్నారు.
తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు కొన్నాళ్లుగా పొసగడం లేదన్నది బహిరంగ రహస్యం. ఒకానొక దశలో భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయికి చేరాయి. జిల్లా నేత వద్ద పంచాయితీలు నడిచాయి. తాజాగా శనివారం ఎస్.కోట దేవీబొమ్మ కూడలి వద్ద బస్సుయాత్ర సమావేశం జరిగింది.
కార్యక్రమానికి వీరిద్దరు ఎవరికి వారు అనుచరులతో సమావేశం వద్దకు హాజరయ్యారు. బలాబలాలను నిరూపించుకునేలా వేర్వేరు దారుల్లో జనాన్ని వెంటబెట్టుకుని వచ్చారు. ఇలా లెక్కకు మిక్కిలి నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతుండడం ఎన్నికల ముందు ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.