ఏపీలో కొంతకాలంగా కొత్త ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై పోరాడితే గానీ..రోడ్డెక్కి నిరసన తెలిపితేగానీ ఏ పనీ జరగడం లేదన్న భావన చాలామందిలో ఉంది. ముఖ్యంగా జగన్ సర్కార్ పై కాంట్రాక్టర్లు గతంలో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అంగన్ వాడీ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్, వైఎస్సార్ జలకళ సంఘం బోర్ వెల్స్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ల సంఘం ఇలా ఒకరి వెంట ఒకరు ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించే కాంట్రాక్టర్లు కూడా భాగమేనని, ఆనాడు ఉపాధి కల్పించిన తాము ఈనాడు బిల్లుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నామని ప్లకార్డులు పట్టుకుని మరీ కాంట్రాక్టర్లు ఏపీవ్యాప్తంగా పలు దఫాల్లో నిరసన తెలిపారు. దీర్ఘకాలంగా ఉన్న మా బిల్లులు చెల్లించండి…మా ప్రాణాలు కాపాడండి….అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దాదాపు రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో, తామంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, బిల్లులు రాకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తమ సొంత ప్రభుత్వంపై ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ షాకింగ్ కామెంట్లు చేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తమ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోనే రూ.200 కోట్లు రావాలని, వారిని చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ. 2.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసిన మైలవరం పంచాయతీ ఉప సర్పంచ్ సీతారెడ్డి బిల్లులు రాక తనకున్న ఐదెకరాల మామిడితోటను అమ్ముకున్నారని, దీంతో, ఆయనను క్షమించమని వేడుకున్నానని అన్నారు. కానీ, ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదని, బిల్లులు రావడం ఆలస్యమైనా సొంతూరుపై మమకారంతోనే సొంత నిధులను ఖర్చు చేసి పనులు పూర్తిచేశానని సీతారెడ్డి తనతో చెప్పినట్లు గుర్తు చేశారు.
నిధులు విడుదల కాకపోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ‘సిగ్గులేదా?’ అని తమను ఎగతాళి చేయడంపై ఆయన స్పందించారు. నిధుల విడుదలలో ఇబ్బందులున్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని, కాబట్టి సిగ్గు పడాల్సిన అవసరం లేదని కవర్ చేశారు.