వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే తన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజీనామా తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. 1995 నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నానని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర సుదీర్ఘ కాలం పనిచేశానని చెప్పారు. అయితే.. అప్పట్లో సత్తెనపల్లి, పెదకూరపాడు టికెట్లు ఆశించినా దొరకలేదని చెప్పారు. ఇక, వైసీపీలోకి వచ్చిన తర్వాత.. 2014, 2019లో రెండు సార్లు జగన్ తనకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు. అయితే, అనివార్య వ్యక్తిగత కారణాల రీత్యా.. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని అన్నారు. తనను రెండు సార్లు గెలిపించిన మంగళగిరి ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
2014 నుంచి 2019 వరకు నీతినిజాయతీలతో ఎమ్మెల్యేగా పని చేశానని, ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేశానని ఆర్కే చెప్పారు. ఒకవైపు బాధగా ఉన్నా ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రెండు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని చెప్పారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో అందజేశానని మీడియాకు చూపించారు ఆర్కే. స్పీకర్ తమ్మినేని అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఓఎస్డీకి లేఖను అందజేసి రాజీనామా ఆమోదించాలని కోరానని చెప్పారు. 1995 నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్ గా ఉన్నానని, 2004లో వైఎస్ దగ్గర పనిచేస్తూ సత్తెనపల్లి టికెట్ ఆశించి భంగపడ్డానని, 2009లో పెదకూరపాడు సీటు ఆశించి మళ్లీ భంగపడ్డానని చెప్పారు. అయినా వైఎస్సార్ ను, కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనలేదని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ ఆహ్వానంతో పార్టీలో చేరానని, ఎమ్మెల్యేగా తనకు జగన్ రెండు సార్లు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. తన వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేశానని తెలిపారు. రాజీనామా చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి బదులుగా… త్వరలోనే అన్ని విషయాలపై మాట్లాడతానని ఆర్కే చెప్పారు. ఆర్కే త్వరలో ఏం చెప్పబోతున్నారన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది.