గడిచిన రెండు..మూడు వారాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారిన ఉదంతాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు అన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టుపై ఉత్కంట సాగుతోంది. దీనిపై ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్న వేళ.. అందుకు భిన్నంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ ను ఇరికించినట్లుగా వ్యాఖ్యానించిన ఆయన.. ‘ఈ కేసులో ఇక అవినాశ్ అరెస్టు తప్పదు’ అని తేల్చేశారు. ఎంపీ అవినాశ్ అరెస్టు మీద ఇంత ఓపెన్ గా మాట్లాడిన మొదటి నేతగా రాచమల్లును చెప్పాలి. అయితే.. అవినాశ్ అరెస్టు అయినప్పటికీ ఆయన బెయిల్ మీద బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. ఇక.. మిగిలిన నేతల మాదిరే టీడీపీ అధినేత చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు.
అవినాశ్ రెడ్డి హింసను ప్రేరేపించరని తాను పూర్తిగా నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ‘‘మొదట్నించి నేను ఇదే విషయాన్ని చెబుతున్నా. హింసను ప్రేరేపించే వ్యక్తి కాదని మనసాక్షిగా నమ్ముతున్నా. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు. హత్యలో అవినాశ్ పాత్ర ఉందని రుజువైతే నేను రాజకీయాల్లో ఉండనని చెప్పా. అంతేకానీ నిందితుడిగా చేరిస్తే రాజీనామా చేస్తానని చెప్పలేదు’’ అని వ్యాఖ్యానించారు.
గతంలో అవినాశ్ రెడ్డి అరెస్టు మీద రాచమల్లు కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తాజాగా కూడా అదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కోర్టులో వివేకాను ఎంపీ అవినాశ్ హత్య చేసినట్లుగా తేలితే మాత్రం తాను తన పదవికి రాజీనామా చేస్తానన్న మాటకు ఇప్పటికి కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఎంపీ అవినాశ్ అరెస్టు అవుతారన్న విషయంపై రాచమల్లు మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.