ఒకటి కాదు రెండు కాదు.. ఇటీవల కాలంలో ఏపీ అధికార పక్ష వైసీపీ నేతలు రోడ్ల మీదకు వచ్చి.. ఎలా ఉన్నారు? ఈసారి ఎవరికి ఓట్లేస్తారు? అన్నంతనే.. అడిగిన వ్యక్తి ఎమ్మెల్యే అయినా.. ఇంకెవరైనా సరే.. మొహమాటం అన్నది లేకుండా మీకు ఓట్లు వేయమని తేల్చేస్తున్న వైనం చూస్తే.. మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
రోజుకో అధికార పక్ష ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురు కావటం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో చేరారు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్. ముఖ్యమంత్రి జగన్ ఫ్లాగ్ షిప్ కార్యక్రమైన గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఆయన.. నల్లిపేట గ్రామంలో గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ కార్యకర్తలతో మాట్లాడారు.
ఎమ్మెల్యే కనిపించింతనే వారు విరుచుకుపడ్డారు. పార్టీని నమ్ముకొని ఉండటం తమదే పొరపాటని స్పష్టం చేశారు. ‘‘మిమ్మల్ని నమ్మి ఊరు మొత్తం ఓట్లు వేస్తే.. కాలువలు నిర్మించారా? ఒక రోడ్డు వేశారా? కనీసం తాగునీటి కుళాయిలైనా వేయగలిగారా?’’ అంటూ ప్రశ్నలు సంధించిన వైనానికి సమాధానం చెప్పలేక ఇబ్బందికి గురయ్యారు ఎమ్మెల్యే కిరణ్. తాజా ఉదంతంలో వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసింది సాదా సీదా ప్రజలు కాదు. పార్టీని తెగ అభిమానించే వైసీపీ కార్యకర్తలే కావటం గమనార్హం.
ఇంతకాలం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న వాదనకు భిన్నంగా తాజాగా ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు ఎదురైన అనుభవాన్ని చూస్తే.. అధికారపార్టీకి చెందిన కార్యకర్తలు సైతం ప్రభుత్వ పని తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉందన్న విషయం స్పష్టమవుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నాలుగేళ్లు అయినా ఎందుకు నెరవేర్చలేదని.. గెలిచినంతనే పనులకు శంకుస్థాపనలు చేసి ఊరుకోవటాన్ని కడిగిపారేశారు. సొంతోళ్ల ఆగ్రహానికి షాక్ కు గురైన ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడలేక వెనుదిరిగిన వైనం వైసీపీ నేతలకు మింగుడు పడనిదిగా మారిందంటున్నారు.