వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేయగా…కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, నిమ్మాడలో ఆయుధాలతో రోడ్ షో నిర్వహించిన టెక్కలి వైసీపీ ఇన్ చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతోపాటు, వైసీపీ రెబల్ అభ్యర్థికి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు వార్నింగ్ ఇచ్చిన ఆడియో క్లిప్ వైరల్ అయింది.
దీంతో,కన్నబాబు రాజు ఫోన్లో బెదిరిస్తున్న సంభాషణను రికార్డ్ చేసిన బాధితుడు…రాంబల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కన్నబాబు రాజుపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై కేసు నమోదు చేసిన రాంబల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, అరెస్టయిన కొద్ది సేపటికే కన్నబాబు రాజు స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు.
అయితే, కన్నబాబురాజును వెంటనే స్టేషన్ బెయిల్ పై విడుదల చేసిన పోలీసులు….అచ్చెన్నాయుడును మాత్రం కోర్టులో హాజరు పరిచి 14 రోజుల రిమాండ్ కు తరలించడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో వైసీపీ నేతలకో న్యాయం…టీడీపీ నేతలకో న్యాయం అన్న రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మండిపడుతున్నారు.