అసెంబ్లీలో చంద్రబాబుపై, ఆయన సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు,అంబటి, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీల తీరుపై కొందరు వైసీపీ నేతలు కూడా గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఆ ఘటన తర్వాత రోజా రియాక్షన్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీరు మాత్రం మారలేదు.
తాజాగా మరోసారి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన జుగుప్సాకరమైన నైజాన్ని బయటపెట్టుకున్నారు. చంద్రబాబు ఏడవడం చూసి తనకు సంతోషం కలిగిందని షాకింగ్ కామెంట్లు చేశారు. కుప్పంలో ఓడిపోవటంతో చంద్రబాబు ఒత్తిడికి లోనయ్యారని, అందుకే అసెంబ్లీలో వింతగా ప్రవర్తించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కుటుంబంపై చంద్రబాబు ఎన్నో విమర్శలు చేశారంటూ తమ నేతల వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
గుజరాత్లో దొరికిన హెరాయిన్‌కు, కాకినాడకు లింకు పెట్టి తన పేరును ప్రస్తావించారని, తనకు సంబంధం ఉందని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. ఇపుడు చంద్రబాబు కుటుంబం బాధపడినట్లుగానే, అప్పట్లో తన కుటుంబం బాధపడిందని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇంత జరిగినా…వైసీపీ నేతలపై జనం విమర్శలు గుప్పిస్తున్నా …ద్వారంపూడి తీరు మారలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.