వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రత్యేకంగా ఉండే శ్రీకాళహస్తి ప్రజాప్రతినిధి బియ్యపు మధుసూదనరెడ్డి.. ఓవరాక్షన్ చేశారు. `ఆడుదాం ఆంధ్రా` కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన విన్యాసాలు ఆయనకే చుట్టుకున్నాయి. దీంతో ప్రజల పాలన వదిలేసి.. ఈ ఆటలేంది మహాశయా! అంటూ.. నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
బియ్యపు మధుసూదన్‌రెడ్డి వాస్తవానికి ఎప్పుడూ మీడియాలో ఉండాలని ఆశిస్తారు. కరోనా సమయంలో ఒకే సారి వంద లారీల బియ్యాన్ని తరలించి.. పేదలకు మేలు చేస్తున్నానని చెప్పుకొనే ప్రయత్నం చేశారు. కానీ, ఈ క్రమంలో పదుల సంఖ్యంలో కార్మికులకు కరోనా సోకి.. అది వందల మందికి పాకింది. దీంతో నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. ఇక, ఆ తర్వాత.. చంద్రబాబును విమర్శించబోయి.. జగన్‌ను ఇరకాటంలోకి నెట్టేశారు.
తానేదో చేయబోయి.. తన చేతిమీదకే తెచ్చుకోవడం ఎమ్మెల్యే మధుకు ఆనవాయితీగా మారిందనే వాదన కూడా సొంత నేతల నుంచే వినిపిస్తూ ఉంటుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. క్రీడల దిశగా యువతీ యువకులను ప్రోత్సహించాలనేది ఈ కార్యక్రమం లక్ష్యం. తన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధు.. ఈ సందర్భంగా తైక్వాండో ప్రదర్శనలో స్వయంగా పాల్గొన్నారు.
మంటలతో ఉన్న పెంకులను తలతో పగలగొట్టే క్రీడలో స్వయంగా పాల్గొని.. అందరితోనూ జై కొట్టించుకుని.. ఫొటోలకు ఫోజులు ఇవ్వాలని అనుకున్నారు. కానీ, పెంకులను తలతో పగలగొట్టే క్రమంలో ఆ మంటలు ఎమ్మెల్యే జుత్తుకు అంటుకున్నాయి. ఇంకేముంది.. మరో క్షణం ఆలస్యమైతే.. ఆ మంటలు తలమొత్తం పాకేవి. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేది. ఇంతలో కార్యకర్తలు.. ముఖాన గోను సంచి కప్పి.. మంటలు ఆర్పేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. ఎమ్మెల్యేపై కామెంట్లు కురిపిస్తోంది.