తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యవహారం.. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నిక ల్లో ఓటరుపై ఆయన చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఈ ఘటనలో ఓటరు కూడా ఎదురు తిరిగాడు. దీంతో అన్నాబత్తుని అనుచరులు అతనిని చితక్కొట్టేశారు. ఈ ఘటన జాతీయస్థాయిలో కలకలం రేపడం.. జాతీయ మీడియా కూడా ప్రధానంగా ప్రసారం చేయడంతో ఎన్నికల సంఘం స్వచ్ఛందంగా స్పందించింది. అన్నాబత్తుని శివకుమార్‌ను తక్షణం అదుపులోకి తీసుకుని.. ఇంటికి తరలించి.. గృహ నిర్బంధం చేయాలని ఆదేశించింది.
దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఇంటికి తరలించారు. ప్రస్తుతం అన్నాబత్తుని శివకుమార్ గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఆయనను ఎప్పుడు బయటకు పంపించాలో తామే చెబుతామని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. అంతేకాదు.. అన్నాబత్తునిపై ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేశారు. 342, 323, 34 ఐపీసీ సెక్షన్ల కింద తెనాలి 2 టౌన్ పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టుముక్కల సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేయడం గమనార్హం.
అయితే.. ఈ ఘటనపై సుధాకర్‌పై కూడా..ఎమ్మెల్యే అన్నాబత్తునిఫిర్యాదు చేశారు. ఆయన తనను కొట్టినట్టు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలా? వద్దా? అనే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోలీసులు లేఖ రాశారు. ప్రజాప్రతినిధిపై చేయి చేసుకున్నారని శివకుమార్ ఆరోపించారు. అయితే.. ఎస్సీ వ్యక్తి సుధాకర్‌పై చేయి చేసుకున్న అన్నాబత్తునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం.. ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం మాత్రం తెనాలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.