అగ్రహం హద్దులు దాటుతోంది. రాజకీయ వైరం పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు ఏపీలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఊరికి వచ్చిన ఒక దళిత లాయర్ పైన ఏపీ అధికార పార్టీ వైసీపీ కి చెందిన వ్యక్తి ఒకరు చెప్పుతో కొడుతూ.. కాళ్లతో తంతూ రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లిన వైనం సంచలనంగా మారింది. అంతేకాదు.. తన కొడుకును కొట్టొద్దంటూ అతడి తల్లి వేడుకుంటే.. ఆమెపైనా దాడి చేసిన ఆనాగరిక ఘటనకు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల వేదికగా మారింది. తీవ్ర సంచలనంగా మారి ఉద్రిక్తతకు కారణమైన ఈ ఉదంతంలోకి వెళితే..
కొలిమిగుండ్లకు చెందిన విజయ్ కుమార్ అనంతపురంలోని అత్తగారింట్లో ఉంటూ బనగానపల్లి.. నంద్యాల.. కర్నూలు కోర్టులకు సంబంధించిన కేసుల్ని వాదిస్తూ ఉంటారు. బనగానపల్లి తెలుగు యువత అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడారు. తన సొంతూరు కొలిమిగుండ్లలోని భూ ఆక్రమణలపై న్యాయపోరాటం చేస్తున్నారు. అక్రమణలపై ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇటీవల భూముల ఆక్రమణలకు సంబంధించిన వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద తహసీల్దారు ఆపీసులో పలు కంప్లైంట్లు చేవారు. ఈ నేపథ్యంలో జులై 27న ఆయన్ను ఫోన్లో బెదిరింపులకు దిగారు. దీనిపై ఆయన అనంతపురం జిల్లా కోర్టులో న్యాయమూర్తికి కంప్లైంట్ చేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆగస్టు మూడున అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు కాగా.. శ్రీరాములు.. సురేష్.. శ్రీనివాసులు.. రమాదేవి.. కళావతిలపైనా కేసులు నమోదయ్యాయి. వారు సైతం విజయ్ కుమార్ ను ఫోన్లో బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఇక.. కేసులు నమోదైన నాగేశ్వరరావు కొలిమిగుండ్లలో వైసీపీ నాయకుడు కమ్ స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి అనుచరుడిగా పేరుంది. ఎమ్మెల్యే కాటసాని మద్దతుతో తనపైనా.. తన తల్లిపైనా దాడి చేశారంటూ విజయ్ కుమార్ పేర్కొన్నారు. తాజాగా విజయ్ కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ రమాదేవి కంప్లైంట్ ఇవ్వటంతో ఆయనపై 354ఏ. 323, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తనపై కంప్లైంట్ చేసిన రమాదేవిని తాను ఇప్పటివరకు చూడలేదని విజయ్ కుమార్ పేర్కొనటం గమనార్హం. తాజాగా ఇంటికి వచ్చిన విజయ్ కుమార్ పై దాడి చేయటమే కాదు.. కాలర్ పట్టుకొని వీధిలో నడిపించుకుంటూ.. చెప్పులతో కొడుతూ..కాళ్లతో తంతూ అసభ్యకరంగా దూషిస్తూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మరీ కేసులు పెట్టటం సంచలనంగా మారింది. దళిత లాయర్ కు జరిగిన ఈ అవమానం షాకింగ్ గా మారింది. ఓవైపు దాడి చేస్తూనే.. స్టేషన్ కు వెళ్లి రివర్సులో కేసు పెట్టించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత రాజకీయ వైరం ఉంటే మాత్రం ఇలా చేయటమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.