వైసీపీపై, సీఎం జగన్ పై ప్రజావ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య కాలంలో విపక్ష నేతలతోపాటు…ఆనం రాంనారాయణ రెడ్డి వంటి స్వపక్షంలోని కీలక నేతలు కూడా విమర్శలు చేయడం జగన్ కు మింగుడుపడడం లేదు. ఇక, ఈ కోవలోనే మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలపై వైసీపీ నేత సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఆ ముగ్గురు నేతల వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు లాస్ అని, ఇలాగైతే జగన్ గెలవడం కష్టమని సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. వారు వైసీపీకి మిత్రులో, శత్రువులో అర్థం కావడం లేదని, ఈ సారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారని సుబ్బారావు వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు, ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత సుబ్బారావు ఆచూకీ లభ్యం కాకపోవడం కలకలం రేపుతోంది. దీంతో, సుబ్బారావు ఏమయ్యాడోనని, ఆయనకు ఏం జరుగుతుందోనని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొడాలినానిపై సుబ్బారావు వ్యాఖ్యల నేపథ్యంలో సుబ్బారావు ఇంటిపై వైసీపీ నేతలు దాడి కూడా చేశారు. సుబ్బారావు బైకు తదితర సామాగ్రిని ధ్వంసం చేశారు. సుబ్బారావు కుటుంబసభ్యులను దుర్బాషలాడుతూ వారిని భయబ్రాంతులకు గురిచేశారు. ఆ తర్వాత సుబ్బారావు మిస్ కావడం కలకలం రేపుతోంది. దీంతో, వైసీపీ నేతలే సుబ్బారావును కిడ్నాప్ చేశారా..? లేక దాడులు చేస్తారేమోనని భయపడి సుబ్బారావే ఎక్కడైనా దాక్కున్నారా అన్న చర్చ జరుగుతోంది.