ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలపై పలు అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జగనన్న అండ చూసుకొని కొందరు వైసీపీ నేతలు అక్రమార్జనకు తెరతీశారని విమర్శలు వస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై రివర్స్ లో కేసులు బనాయించి జైలుకు పంపుతున్న వైనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నేత ఒకరు అరెస్టు కావడం కలకలం రేపింది.
మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ల విజయ ప్రసాద్ ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త ఇపుడు ఏపీతోపాటు ఒడిశాలోను చర్చనీయాంశమైంది. చిట్‌ఫండ్ కేసులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఒడిశా సీఐడీ పోలీసులు విజయ ప్రసాద్ ను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. ‘వెల్ఫేర్’ సంస్థ పేరుతో విజయ ప్రసాద్ రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తున్నా రు.
ఈ క్రమంలోనే ఏపీ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒడిశాలోనూ చిట్‌ఫండ్ వ్యాపారం చేసిన విజయ ప్రసాద్…డిపాజిట్‌దారులకు సక్రమంగా చెల్లింపులు జరపలేదన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రకారం విజయప్రసాద్ పై పలువురు ఖాతాదారులు గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ ప్రసాద్ పై ఒడిశా సీఐడీ పోలీసులు రెండేళ్ల కిందట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ కేసు విచారణలో భాగంగా విశాఖ వచ్చిన సీఐడీ పోలీసులు విజయ్‌ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఆయన నివాసంలోనే సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదులపై విచారణ చేసేందకు విజయ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులకు సీఐడీ పోలీసులు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.