బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో భాగమైన తెలుగు ఫిలిం సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి లాంటి ప్రముఖులతో మొదలుపెట్టి చాలామంది మీద కేసులు నమోదయ్యాయి. అందులో యాంకర్ శ్యామల కూడా ఒకరు. ముందు కేసులు నమోదైన వాళ్లలో శ్యామల లేదు.
కానీ చిన్న చిన్న వాళ్ల మీద కేసులు పెట్టి పెద్ద వాళ్లను వదిలేస్తున్నారంటూ శ్యామల సహా పలువురు బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీళ్ల సంగతేంటి అని నెటిజన్లు అడగడంతో తెలంగాణ పోలీసులు వీరి మీదా కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇన్‌యాక్టివ్ అయిపోయిన శ్యామల.. ఈ రోజు తన లాయర్‌తో కలిసి పోలీసు విచారణకు హాజరైంది.
ఈ సందర్భంగా మీడియాను కూడా కలిసి మాట్లాడింది శ్యామల. వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో పోలీసుల విచారణ గురించి తాను ఏమీ మాట్లాడలేనని శ్యామల చెప్పింది. ఐతే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం తప్పు అని చెప్పిన ఆమె.. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని అంది. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని.. దీని వెనుక ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు తన మద్దతు పూర్తిగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించింది.
ఇకపై బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని ఆమె స్పష్టం చేసింది. పోలీసులు ఏం అడిగారు.. మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడిగారా అంటూ మీడియా వాళ్లు ప్రశ్నలు వేస్తుండగా.. తాను ఇంతకుమించి ఏం మాట్లాడినా తప్పు అవుతుందని.. కేసు కోర్టులో ఉండడం వల్ల ఇంకేం మాట్లాడనని చెప్పేసి వెళ్లిపోయింది శ్యామల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయిన శ్యామల.. ఈ కేసు తర్వాత రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.