ఏపీ అధికార పార్టీ వైసీపీ లో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు టికెట్ దక్కని వారు(అంటే.. ఇంచార్జి పీఠాలు) ఒక రకమైన కారణంతో రోడ్డెక్కారు. తమకు అన్యాయం చేశారంటూ.. రాయదుర్గం ఎమ్మెల్యేకాపు రామచంద్రారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పిటాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఇలా చెప్పుకొంటూ పోతే.. చాలా మంది తమకు టికెట్ దక్కలేదని ఆవేదనలోనూ.. ఆందోళనలోనూ ఉన్నారు.
కొందరు పార్టీ మారేందుకు కూడా రంగం రెడీ చేసుకున్నారు. ఇక, ఇప్పటికే ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ జనసేనలోకి వెళ్లగా.. టికెట్ ఆశించి భంగపడిన సీ రామచంద్రయ్య(ఈయన కూడా ఎమ్మెల్సీనే) టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేసమయంలో తమ కుమారులకు రెండు టికెట్ లు ఆశించి.. ఒకటి కూడా దక్కక పోవడంతో ఉత్తరాంధ్ర నేత దాడి వీరభద్రరావు..కుమారులతో కలిసి టీడీపీ కండువా మార్చేసుకున్నారు. రేపో మాపో.. కొలుసు వారి కథ కూడా.. సైకిల్‌తో ముడిపడనుందనే వార్తలు వస్తున్నాయి. ఇలా.. టికెట్ దక్కని వారి బాధ వర్ణనాతీతంగా ఉంది.
ఇక, ఇప్పుడు ఇంచార్జ్‌లుగా స్థానాలు పొందిన నాయకుల ఆవేదన మరో విధంగా కనిపిస్తోంది. టికెట్ దక్కినా.. వారు ఎక్కడా సంతృప్తిగా కనిపించడం లేదు. పెడన నుంచి పెనమలూరుకు ఛేంజ్ అయిన.. మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకుడు జోగి రమేష్.. మళ్లీ తాడేపల్లి తలుపు తట్టారు. ఈ సీటు నాకొద్దు! అంటూ.. ఆయన సజ్జల రామకృష్నారెడ్డి దగ్గర.. సణుగుడు మొదలు పెట్టారు. తను కోరుకున్నది మైలవరం టికెట్ అని.. పోనీ.. తను ఉన్న పెడన అయినా.. ఉంచాలని ఆయన అభ్యర్థించారు. అంతేకాదు.. పెనమలూరులో ఈ దఫా టీడీపీ ఎలా గెలుపు గుర్రం ఎక్కుతుందో కూడా ఆయన వివరించేశారని అంటున్నారు.
మరోవైపు.. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరులోనూ ఇదే పరంపర తెరమీదికి వచ్చింది. మంత్రి గుమ్మనూరు జయరాంకు పార్టీ కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ, ఆయన మాత్రం దీనిని తీసుకున్నా.. పోటీకి ఇష్టపడడం లేదు. అనుచరలతో భేటీ పెట్టి.. వారి అభిప్రాయంగా తన అభిప్రాయాన్ని అధిష్టానానికి పంపించి.. మళ్లీ ఆలూరు లేదా.. మరో నియోజకవర్గానికి పరిమితం కావాలన్నదిఆయన ఆలోచనగా ఉంది. ఇక, తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి కూడా.. ఇదే బాధలో ఉన్నారు. ఆయన సౌమ్యుడు.. ఫైర్ బ్రాండ్ కాకపోవడంతో తన ఆవేదనను జిల్లాకు చెందిన మంత్రికి చెప్పుకొన్నారట. ప్రస్తుతం ఈయనకు ఎస్సీ నియోజకవర్గం సత్యవేడు అసెంబ్లీని కేటాయించారు. కానీ, ఆయన తనస్థాయిని తగ్గించారంటూ(ఎంపీ నుంచి ఎమ్మెల్యే) ఆవేదనలో ఉన్నారు. ఇలా.. టికెట్ దక్కిన వారు.. ఆవేదనలో కూరుకుపోవడంతో వైసీపీ రాజకీయాలు వేడిగానే ఉన్నాయి.