ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వైసీపీని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్ర ప్రయోజనాలను మంటగలిపారని షర్మిల విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పై తాజాగా షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. విద్యాసంస్థలకు ఎన్టీఆర్ పేరుని తొలగించి జగన్ గతంలో తప్పు చేశారని షర్మిల దుయ్యబట్టారు.
అయితే, అదే తప్పును ఇప్పుడు చంద్రబాబు కూడా చేస్తున్నారని షర్మిల విమర్శించారు. అప్పట్లో ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్ఆర్…ఇద్దరూ ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించి చెరగని ముద్ర వేశారని కొనియాడారు. వారిని రాజకీయాలకు అతీతంగా చూడాలని, నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని హితవు పలికారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శప్రాయమని, ఏ పార్టీ కోసం కాదని అన్నారు. వైసీపీ మీద ఉన్న కోపాన్ని వైఎస్ఆర్ పై చూపించడం సరికాదని కూటమి ప్రభుత్వానికి షర్మిల హితవు పలికారు. వైసీపీలో వైఎస్సార్ లేడని, అది ఎప్పటికైనా వైవీ, సజ్జల, సాయి రెడ్డిల పార్టీ అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.