ఏ పార్టీకైనా అధికారం దక్కించుకోవాలంటే.. అన్ని వర్గాలను, అన్ని వ్యూహాలను అనుసరించాల్సిందే. కలిసి వచ్చే అన్ని వర్గాలను కలుపుకొని పోతేనే ఏ పార్టీకైనా విజయం సాధ్యమవుతుంది. అందుకే.. రాజకీయ పార్టీలు.. అధినేతలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. గత ఎన్నికల సమయంలో వైసీపీకి ఓ వర్గం సినీ నటులు అండగా ఉన్నారు. మరో వర్గం.. తటస్థంగా వ్యవహరించగా.. టీడీపీకి ఎప్పుడూ ఉండే వారి మద్దతు కొనసాగింది.
ఇక, ఇప్పుడు పరిస్థితి మారింది. వైసీపీకి సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అడుగడుగునా వివాదాలు.. విమర్శలతోనే వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అంటున్నారు. ఎవరి విషయం ఎలా ఉన్నా.. సినిమా ఇండస్ట్రీలో అందరూ గౌరవించే చిరంజీవి విషయంలోనూ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా చిరు నటించిన బోళా శంకర్ సినిమా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అభిమాను లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగానే చిరంజీవి సినిమాపై ఆంక్షలు విధించారని చర్చిం చుకుంటున్నారు. మరోవైపు మెగా అభిమానులు కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు, దానికి వైసీపీ నాయకులు చేసిన కౌంటర్లు వంటివి చర్చనీయాం శంగా మారాయి.
ఇదిలావుంటే.. వైసీపీ నాయకులు కూడా సినిమా ఇండస్ట్రీ మద్దతు విషయంలో పెద్దగా ఆశలు పెట్టుకు న్నట్టు కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు చిరు విషయంలో అంతో ఇంతో చూసీ చూడనట్టు వ్యవహరించిన వారు.. ఇప్పుడు ఆయనపైనా విమర్శలు చేస్తున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీపై ఇక, వైసీపీ ఆశలు వదులుకున్నట్టేనని అంటున్నారు. ఇదే విషయాన్ని కృష్ణాజిల్లాకు చెందిన నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు “మాకు పథకాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీపై ఆధారపడాల్సిన అవసరం లేదు“ అని వ్యాఖ్యానించారు.