ఏపీ వైసీపీ ముఖ్య నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి.. అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలోనే సెగ తగులుతోంది. అది కూడా సొంత పార్టీ నాయకుల నుంచే కావడం మరింత ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారకూడదని.. తన నియోజకవర్గాన్ని మార్చొద్దని అంబటి కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు. గత ఎన్నికల్లో కోడెల శివప్రసాద్‌పై ఆయన విజయం దక్కించుకున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికలలో అంబటి మరోసారి సత్తెనపల్లి నుంచే పోటీ చేసి విజయం సాధించాలని భావి స్తున్నారు. ఆయన అనుకోవడం.. అధిష్టానాన్ని ఒప్పించడం(?) వరకు బాగానే ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో ఆయనకు సహకరించేవారే ఇప్పుడు కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అంబటి వెంట నడిచి.. ఆయన జెండాలు మోసి.. ఆయనకు జై కొట్టిన నాయకులు ఇప్పుడు.. ఖస్సు మంటున్నారు. ఆయనకు మరోసారి టికెట్ ఇవ్వొద్దని బాహాటంగానే చెబుతున్నారు.
రాంబాబుకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఉద్యమిస్తున్నారనే చెప్పాలి. తాజాగా ఆయన అంబటికి వ్యతిరేకంగా ఉన్న నాయకులను కూడగట్టారు. వచ్చేఎన్నికల్లో అంబటికి టికెట్ ఇవ్వొద్దంటూ.. వీరంతా తీర్మానం చేశారు. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి వర్తమానం పంపాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని యర్రం వెంకటేశ్వరరెడ్డి కోరుతున్నారు. దీంతో ఆయన దూకుడు పెంచారు.
మరో వైపు.. గత ఎన్నికల్లో తాము అంబటికి అనుకూలంగా పనిచేశామని.. కానీ, ఈ నాలుగేళ్ల కాలంలో కనీసం తమను పట్టించుకోలేదని దిగువ స్థాయి నాయకులు చెబుతున్నారు. పైగా తమపైనే కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్నారని వారు అంటున్నారు. అంబటికి మరోసారి ఈ టికెట్ ఇస్తే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో అంబటి పోటిచేస్తే ఓడిస్తామనివారు చెబుతున్నారు. దీంతో సత్తెనపల్లిలో సిట్టింగ్ నాయకుడికి సెగ ప్రారంభమైనట్టేనని అంటున్నారు పరిశీలకులు.