సినీ పరిశ్రమకు సంబంధించి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు కౌంటర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోని అనేక మంది కార్మికులను రక్షించే బాధ్యత, వారికి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొంటూ.. సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు.. సినీ నటులైనా.. రాజకీయ నాయకులైనా ప్రజల ఆదరణ ఉన్నంత వరకే .. పైకి వస్తారని వ్యాఖ్యానించారు.
సినిమా పరిశ్రమను వేరుగా చూస్తే.. ప్రభు్త్వాలకు ఏం పని అని ప్రశ్నించడానికి వీల్లేదని కూడా సాయిరెడ్డి పేర్కొన్నారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం కూడా సర్కారు బాధ్యతేనని చెప్పారు. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని సాయిరెడ్డి తేల్చి చెప్పారు. అయితే.. దీనిపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. “అయితే.. సాయిరెడ్డిగారు.. ఈ నాలుగేళ్ల మీ పాలనలో ఏపీ నుంచి ఎంత మొత్తం ఇచ్చి సినీమా కార్మికులను ఆదుకున్నారో చెబుతారా?“ అని కొందరు ప్రశ్నించారు.
“సాయి సర్.. మీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో వేటికి.. సినిమా రంగంలోకి కార్మికులు, వారి కుటుంబాలకు, పేదలకు అమలు చేశారో వివరించండి. అమ్మ ఒడి ఎవరికైనా ఇచ్చారా? వైఎస్సార్ నేస్తం ఇచ్చారా“ అని ప్రశ్నలు గుప్పించారు. ఇంకొందరు అయితే.. విమర్శలు గుప్పించారు. “ప్రభుత్వం ఏదైనా సినిమా రంగం నుంచి పన్నుల రూపంలో పిండుకున్నవే తప్ప.. వారికి చేసిన మేలంటూ ఏమీ లేదు“ అని వ్యాఖ్యానించారు.
ఇంకొందరు.. సినిమా రంగంపై అంత ప్రేమ ఉంటే.. వారి ప్రతిభకు గుర్తింపుగా పెట్టిన నంది అవార్డులను ఎందుకు ఇవ్వడం లేదో చెబుతారా? అని ప్రశ్నించారు. సినిమా కార్మికుల పిల్లల కోసం.. ఏమైనా స్కూళ్లు కట్టించారా? అని కొందరు నిలదీశారు. మొత్తానికి సాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి కౌంటర్ల పరంపర కొనసాగుతోంది.