వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ యాత్ర-2 రెండో రోజుకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ యాత్ర మంచి స్పదన తెచ్చుకుని వైసీపీకి ఉపయోగపడ్డ నేపథ్యంలో ఈసారి జగన్ మీద తీసిన యాత్ర-2 కూడా అలాగే మంచి ఫలితాన్నందుకుని అధికార పార్టీకి ఉపయోగపడుతుందని అంచనా వేశారు. కానీ రిలీజ్ ముంగిట ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు ఈ సినిమాపై.
కానీ రిలీజ్ రోజు మాత్రం సోషల్ మీడియాలో యాత్ర-2 బాగానే ట్రెండ్ అయింది. అది ఐపాక్ వల్ల సాధ్యమైంది. వైసీపీ మద్దతుదారులు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కడప లాంటి సిటీల్లో బాగానే సందడి చేశారు. అర్లీ మార్నింగ్ షోలు కూడా పడ్డాయి. వాటిలో జగన్ అభిమానుల హంగామా కనిపించింది. సోషల్ మీడియాలో యాత్ర-2, వైఎస్ జగన్ అనే పదాలు బాగా ట్రెండ్ అయ్యాయి. సినిమాను పొగిడేవాళ్లంతా వైసీపీ వాళ్లే. తిట్టేవాళ్లు మాత్రం అన్ని పార్టీ వాళ్లూ ఉన్నారు.
జగన్ ఫ్యాన్స్‌కు సినిమా సూపర్ అనిపించినా.. న్యూట్రల్ ఆడియన్స్ సినిమాను తిరస్కరించారు. ఇది పొలిటికల్ మూవీ కాబట్టి ఏకపక్షంగానే ఉంటుందని తెలుసు కానీ.. మరీ వన్ సైడెడ్‌గా ఉండడంతో సామాన్య ప్రేక్షకుల తిరస్కారానికి గురైనట్లే కనిపిస్తోంది.
తొలి రోజు తర్వాత యాత్ర-2 గురించి మాట్లాడేవాళ్లే లేరు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు కూడా సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తున్నట్లు లేరు.
ఇక టీడీపీ, జనసేన వాళ్లు ఈ సినిమాకు అటెన్షన్ ఇచ్చి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడం ఎందుకు అనుకున్నారో ఏమో.. దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఏపీలోని మేజర్ థియేటర్లలో యాత్ర-2 థియేటర్లు జనాల్లేక వెలవెలబోతున్నాయి. పెయిడ్ షోలన్నీ కూడా తొలి రోజుకే పరిమితనట్లు తెలుస్తోంది. వైసీపీ వాళ్లు కూడా పెద్దగా సినిమాను మోయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.