అక్రమ అరెస్టులకు అంతులేదు!!
ప్రాథమిక విచారణలైనా ఉండవు
ఏకంగానే అరెస్టులే
తాజా టార్గెట్ మాజీ మంత్రి నారాయణ
టెన్త్ ప్రశ్నపత్నం లీకేజీలో అరెస్టు
నిబంధనలు పాటించకుండా
హైదరాబాద్ నుంచి తరలింపు
నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌గా
ఆయన లేరని తెలిసీ దురాగతం
నవ్యాంధ్రలో జగన్ జమానాలో టీడీపీ నేతల అక్రమ అరెస్టుకు అంతులేకుండా పోతోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి దాకా.. ఎమ్మెల్సీ బీటెక్ రవి నుంచి తాజా మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ వరకు అన్నీ అక్రమ అరెస్టులే. నిర్దిష్టంగా నేరారోపణ లేకుండా.. ప్రాథమిక విచారణ కూడా జరపకుండా అరెస్టులు చేయడం.. ఆనక బెయిల్ ఇస్తే కోర్టులపై పడడం ప్రభుత్వ పెద్దలకు, వైసీపీ నేతలకు రివాజుగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో మాల్‌ప్రాక్టీసు, టెన్త్ పరీక్షల ప్రశ్నపత్నాల లీకేజీ యథేచ్ఛగా నడచింది. దీనిపై ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినడంతో.. ఈ నిందను సీఎం జగన్, ప్రభుత్వ పెద్దలు నారాయణ విద్యాసంస్థలపై నెట్టేశారు.
ఇది ముందస్తు వ్యూహంలో భాగమేనని తర్వాత అర్థమైంది. చిత్తూరు పోలీసులు ఈ నెల పదో తేదీన నారాయణను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకుండా కిడ్నాప్ తరహాలో అదుపులోకి తీసుకున్నారు. తొలుత టెన్త ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీసు వ్యవహారంలో అరెస్టు చేసినట్లు ప్రచారం చేశారు. ఆ తర్వాత అమరావతి భూముల విషయంలో అంటూ మరో ప్రచారానికి తెర లేపారు. చివరికి టెన్త తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీసు అంశంలో అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిషాంతరెడ్డి ఆ రోజు సాయంత్రం వెల్లడించారు. ఆయన్ను ఎక్కడ తిప్పారో తెలియదు గానీ.. అర్ధరాత్రి దాటాక చిత్తూరు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్‌కు పంపాలని కోరారు. ఇందుకు న్యాయాధికారి నిరాకరించారు. ఎందుకంటే తాను విద్యాసంస్థల చైర్మన్‌గా 2014లోనే రాజీనామా చేశానంటూ సంబంధిత పత్రాలను నారాయణ కోర్టుకు సమర్పించారు.
చైర్మన్‌గా లేని వ్యక్తిని ఎలా అరెస్టు చేశారని న్యాయాధికారి పోలీసులను ప్రశ్నించారు. ఆయనకు బెయిల్ మంజూరుచేశారు. అయితే బెయిల్ ఇవ్వడాన్ని జగన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జిల్లా కోర్టులో అప్పీలు దాఖలు చేశారు. నారాయణను న్యాయాధికారి రిమాండ్‌కు పంపకపోవడాన్ని తప్పుబట్టారు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిదీ అదే మాట. అంటే.. నేరం చేసినా చేయకున్నా టీడీపీ నేతలను జైలుకు పంపడమే జగన్ ప్రధాన లక్ష్యమని తేలిపోయింది. నారాయణను అరెస్టుచేసే అవకాశం లేకపోవడంతో ఆయన కుమార్తెలనైనా అరెస్టు చేయాలని భావించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
మాల్ ప్రాక్టీసు ఎక్కడ?
అసలు మాల్ ప్రాక్టీసుకు పాల్పడింది ఎవరు? ఈ వ్యవహారంలో నారాయణ పాత్ర ఏమిటి.. తదితర అంశాలను పరిశీలిస్తే.. ఆయన అరెస్టు వెనుక రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని స్పష్టమైంది. టెన్త పబ్లిక్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27న ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. ఆ రోజు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలోని నెల్లేపల్లె పరీక్ష కేంద్రం వద్దకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోము వెళ్లారు. ఒకటో గదిలో ఇన్విజిలేటర్‌గా ఉన్న మరో ప్రభుత్వ టీచరు పవనకుమార్‌రెడ్డి సహకారంతో తెలుగు ప్రశ్నపత్రాన్ని తన సెల్‌ఫోనలో ఫొటో తీసుకున్నారు. వెంటనే 9.37 గంటలకు దాన్ని చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ సురేశకు పంపించారు. దాన్ని సురేశ 9.39కు తిరుపతిలోని ఎనఆర్‌ఐ అకాడమీ ప్రతినిధి సుధాకర్‌కు పంపారు. ఆ వెంటనే సుధాకర్ 9.40 గంటలకు తిరుపతిలోని చైతన్య స్కూల్ డీన మోహనకు, తిరుపతిలోని నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డికి పంపించారు. 9.41 గంటలకు మోహన దానిని తిరుపతిలోని చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ఆరిఫ్‌కు పంపారు. అంతటితో ఈ చైన ముగిసింది.
మరోవైపు నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి ‘చిత్తూరు టాకీస్’ అనే వాట్సాప్ గ్రూపులో 9.57 గంటలకు ప్రశ్నపత్రాన్ని పోస్ట్ చేసి, మళ్లీ డిలీట్ చేశారు. అప్పటికే అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై ఎస్పీ రిషాంతరెడ్డికి డీఈవో పురుషోత్తం ఫిర్యాదు చేశారు. చిత్తూరు వనటౌన పోలీసు స్టేషనలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చిత్తూరు పోలీసులు బృందాలుగా ఏర్పడి ముందుగా గిరిధర్‌రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సహా ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఆ వివరాలను మీడియాకూ వెల్లడించారు. నిజానికి ప్రశ్నపత్రం బయటకు రావడానికి ప్రధాన కారకులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వారినుంచే ఆ ప్రశ్నపత్రం తిరుపతిలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులకు చేరింది. మూడో బదలాయింపులో నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డికి చేరింది. మధ్యలో పలు ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు ఉండగా.. ఒక్క నారాయణ సంస్థలనే ఎందుకు టార్గెట్ చేశారన్నదే అసలు సందేహం. అందులోనూ ఏకంగా ఆ సంస్థల అధినేత నారాయణ మీదే బెయిల్ కూడా రాకుండా పోలీసులు 408, 409 ఐపీసీ సెక్షన్లు పెట్టారు. మాల్‌ప్రాక్టీసు వెనుక నారాయణ హస్తం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉందని ఎలాంటి సాక్షాల ద్వారా గుర్తించారని అడిగితే.. ఎస్పీ రిషాంతరెడ్డి మాట దాటవేశారు.
అలాంటి వివరాలు చెప్పకూడదన్నారు. మాల్‌ప్రాక్టీసు వ్యవహారంలో తొలిరోజు ఏడుగురు అరెస్టు కాగా, వారిలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఐదుగురు ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులున్నారు. అందులో ఒకరు నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్. మిగతా నలుగురు వేర్వేరు విద్యాసంస్థలకు చెందినవారు. కేవలం టీడీపీ నేత అనే కారణంగా నారాయణ ఒక్కడి మీదే దృష్టి సారించారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఎస్పీ స్పందిస్తూ, మిగిలిన విద్యాసంస్థల ప్రతినిధులంతా గతంలో నారాయణలోనే పనిచేశారని సమాధానమిచ్చారు. నిజానికి మాస్ కాపీయింగ్ వ్యవహారంలో అరెస్టయిన 60మందిలో ఏకంగా 36మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇద్దరు ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. ఈ 38 మందినీ సస్పెండ్ చేశారు. మరి విద్యాశాఖలో పనిచేస్తున్న ఇంతమందిపై కేసులు ఉన్నప్పుడు… ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సంబంధం ఉండదా? ర్యాంకుల కోసమే ప్రశ్నపత్రం లీక్ చేశారని ప్రభుత్వం చెబుతోంది. అలాగైతే ప్రశ్నపత్రాన్ని తమ వద్దే ఉంచుకుంటారు తప్ప వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో ఎందుకు పోస్టు చేస్తారు? వాస్తవానికి పరీక్షల తొలిరోజు తెలుగు ప్రశ్నపత్రం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలోని కేంద్రంలో జరిగింది.
అక్కడ పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఆయా స్కూళ్ల టీచర్లు, సిబ్బంది అంతా కలసి తమ విద్యార్థులను పాస్ చేయించుకునేందుకు ప్రశ్నపత్రం లీక్ చేసి మాస్‌కాపీయింగ్‌కు అనుమతించారు. అదేరోజు తిరుపతిలో పవన్‌కుమార్‌రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రశ్నపత్రం లీక్ చేశారు. ఆ తర్వాత రెండో పరీక్ష ఇంగ్లీషు, మూడో పరీక్ష హిందీ రోజు కూడా కొన్నిచోట్ల మాస్ కాపీయింగ్ జరిగింది. శ్రీసత్యసాయి, ఏలూరు జిల్లాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులపై కేసులు పెట్టారు. మొదటిరోజు నుంచి జరిగిన మాస్కాపీయింగ్లోనూ ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. దీనిని దాచిపెట్టి రాజకీయ కక్ష సాధింపులకే నారాయణను అరెస్టు చేశారన్న విమర్శలు వస్తున్నాయి.
Comments 2