ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి జై అన్న జగన్ సీఎం కాగానే మాట తప్పి మడమ తిప్పిన సంగతి తెలిసిందే. కేవలం టిడిపిని దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతో అమరావతిని జగన్ నిర్వీర్యం చేసిన వైనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగన్ దెబ్బకు అమరావతికి రావలసిన ప్రఖ్యాత విద్యాసంస్థలు, ప్రముఖ కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి. ఇక, జగన్ మార్క్ ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకోలేక ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న కొన్ని సంస్థలు కూడా తమ దుకాణం ఎత్తేశాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన హయాంలో అమరావతికి ప్రతిష్టాత్మక ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వచ్చిందని, కానీ ఆ యూనివర్సిటీకి సరైన రోడ్లు వేయడం కూడా జగన్ కు చేతకాలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సరైన రోడ్డు లేని విషయాన్ని ఆ వర్సిటీ వ్యవస్థాపక వీసీ డాక్టర్ టీఆర్ పారవేందర్ ఆవేదన వ్యక్తం చేస్తూ వెల్లడించారని తెలిపారు.
ఆయన షేర్ చేసిన న్యూస్ క్లిప్ పై చంద్రబాబు స్పందించారు. తన హయాంలో రాష్ట్రానికి వీఐటీ, ఎస్ఆర్ఎం వంటి ఎన్నో విద్యాసంస్థలు తెచ్చామని, పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ, తమపై కక్షతో యూనివర్సిటీకి రోడ్లు వేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా, రోడ్లకు మరమ్మతులు చేయకుండా జగన్ తాత్సారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని, రాజకీయ లక్ష్యాలు, కక్షలు సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని చంద్రబాబు హితవు పలికారు. జగన్ ఆలోచనలు రాష్ట్ర పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.