ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయాన్ని ప్రపంచం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే కొంతకాలంగా సంప్రదాయేతర, పర్యావరణహిత ఇంధనంగా విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రిక్ బైకు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు సంప్రదాయేతర ఇంధనమైన విద్యుత్ తో నడిచేలా అందుబాటులోకి వచ్చాయి.
విద్యుత్ సంప్రదాయేతర ఇంధన వనరుగా వాడుకలోకి రావడం, చౌక ధరకే అందుబాటులో ఉండటం, పర్యావరణ హితం కూడా కావడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ ఏర్పడింది. క్రమక్రమంగా వాటి తయారీ, వాడకం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆటోమొబైల్ రంగ నిపుణులు కేవలం విద్యుత్ బైకులు, కార్లకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత ఇంధన వినియోగంపై చైతన్యం వస్తున్న నేపథ్యంలో తాజాగా విద్యుత్ తో నడిచే విమానాన్ని కూడా తయారు చేశారు.
ఈ తరహాలో తయారైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఏరోప్లేన్ ‘ఆలిస్’ నేడు నింగిలోకి ఎగిరింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఈ ఎలక్ట్రిక్ ఏరోప్లేన్ టెస్ట్ లైట్ చేశారు. గాల్లో 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాలపాటు ఈ-ప్లేన్ గగనయానం చేయడం విశేషం. పూర్తి విద్యుత్ తో నడిచే ఈ విమానాన్ని ఈవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అనే సంస్థ రూపొందించింది. గరిష్టంగా 260 నాట్ల వేగంతో ప్రయాణించే ఈ విమానం ఒక గంట ప్రయాణించడానికి ఖర్చు చాలా తక్కువ అని ఆ సంస్థ చెబుతోంది.
ఆలిస్ లో 3 విమాన వేరియంట్లు లభించునన్నాయి. ఆరు సీట్లతో ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, 9 సీట్లతో కమ్యూనిటీ, కార్గో మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని మోడళ్లలో ఇద్దరు పైలట్లు ఉంటారు. ఈ-ఏరోప్లేన్ అందుబాటులోకి రావడంతో పలు ఎయిర్లైన్స్ సంస్థలు, కార్గో సంస్థలు ఈ విమానాల కోసం క్యూ కడుతున్నాయి.