ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కవితతోపాటు కేసీఆర్ పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరిట నిరసన దీక్షను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా? అంటూ కవితనుద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. మహిళా బిల్లుపై దీక్ష చేసే అర్హత కవితకు లేదని, తన తండ్రి ఇంటి ముందు కవిత ధర్నా చేసి తెలంగాణలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ను ప్రశ్నిస్తే బాగుండేదని షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో, బండి సంజయ్ ముద్దు కామెంట్లు కాక రేపుతున్నాయి.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ లలోని తెలంగాణ భవన్ ల వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ ఎస్ శ్రేణులు దగ్దం చేశాయి. ఇక, బండి సంజయ్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు.
విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై జాతీయ మహిళా కమిషన్ కు రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ రాయనుంది. బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా…కేసు నమోదైంది. ఇక, కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ కు అక్కాచెల్లెళ్లు లేరా అంటూ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.