గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అనుకున్నదొక్కటి…అయినదొక్కటి తరహాలో ఆ కార్యక్రమంలో భాగంగా జనం గడప తొక్కుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వెళ్లిన ప్రతి చోటా వైసీపీ నేతలను జనం నిలదీస్తున్నారు. తమ ప్రాంతాలలో అభివృద్ధి జరగడం లేదంటూ అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా షాక్ తగిలింది.
టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ…షాడో వైసీపీ నేతగా కొనసాగుతున్న వంశీ కూడా ఆ కార్యక్రమానికి వెళ్లారు. విజయవాడ రూరల్ లోని నిడమానూరులో పర్యటించిన వంశీని ఒక మహిళ నిలదీశారు. గతంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు లేకపోవడంతో యువత ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఆమె ప్రశ్నించారు.
మీ ముఖ్యమంత్రి జగన్ ను అడిగి ఐటీ కంపెనీలను ఈ ప్రాంతానికి తిరిగి తీసుకురావాలని ఆ మహిళ సూచించారు. దీనికి వంశీ వెటకారంగా సమాధానమివ్వబోయారు. అక్కా మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు బాగా చదువుతున్నారంటూ వంశీ సెటైర్ వేసే ప్రయత్నం చేశారు. అయితే, వంశీ మాటలకు ఆ మహిళ అనూహ్యంగా కౌంటర్ ఇచ్చారు. ఆ పత్రికల వల్లే కదా మీరు పెద్దవాళ్లు అయింది అంటూ వంశీని ఉద్దేశించి రిటార్ట్ ఇచ్చారు.
ఆమె నుంచి ఆ తరహా జవాబు ఊహించని వంశీ మెల్లగా షాక్ నుంచి తేరుకొని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడి వాతావరణంలో ఐటీ ఉద్యోగులు పని చేయలేకపోతున్నారని, అందుకే చాలా కంపెనీలు వెళ్లిపోయాయని చెప్పుకొచ్చారు. అయితే, ఆ వ్యాఖ్యలకు కూడా ఆ మహిళ షాకింగ్ సమాధానమిచ్చారు. మీరు ఇంకా హైదరాబాదునే అభివృద్ధి చేయాలనుకుంటున్నారంటూ ఆమె విమర్శించడంతో వంశీ సైలెంట్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయారు.