ఇద్దరు స్నేహితులు ఓ డొక్కు బస్సునే తమ ఇల్లుగా చేసుకొని జీవితం సాగిస్తుంటారు….అందులోని తిండి, నిద్ర…అన్నీ చేస్తూ బ్రతుకీడుస్తుంటారు. ఆ బస్సుకు రిపేర్లు చేసుకుంటూ..అడపాదడపా ఆడుతూ పాడుతూ బ్రతికేస్తుంటారు. అదంతా రీల్ లైఫ్ లో సరదాగా సాగిపోయే ఓ సినిమాలోని సన్నివేశాలు. అయితే, తాజాగా హైదరాబాద్ లో ఓ కారులో ఇదే తరహాలో ఒక మహిళ కాలం వెళ్లదీస్తున్న వైనం మాత్రం ఆ సినిమా అంత సరదాగా లేదు.
హైదరాబాద్ లోని మైత్రివనం సమీపంలో ఉన్న మధురానగర్ మెయిన్‌రోడ్డుపై రెండేళ్లుగా ఓ మారుతీ ఓమ్ని కారు (ఎ.పి.31క్యు-6434) ఉంటోంది. అందులో ఓ మహిళ నివాసముంటున్నట్లు స్థానికులు తాజాగా పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, విచారణ జరిపిన పోలీసులు….పలు విషయాలు వెలికి తీశారు. ఆ మహిళ పేరు గుర్రం అనిత (30) అని చెప్పడంతో పోలీసులు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె తన పేరు మినహా మరే వివరాలు వెల్లడించకపోవడంతో పోలీసులు స్థానికులను విచారణ జరిపి పలు విషయాలు తెలుసుకున్నారు.
అనిత స్థానికంగా ఉన్న రాజ్‌ధూత్ హాస్టల్లో ఉండేదని, అయితే, ఫీజు చెల్లించకపోవడంతో రెండేళ్ల క్రితం హాస్టల్ నిర్వాహకులు ఖాళీ చేయించారని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ఆ తర్వాత తన సామాగ్రి తీసుకుని ఆ కారులోనే అనిత నివాసముంటోందని స్థానికులు వెల్లడించారు. ఆ కారునే ఇల్లుగా మార్చుకుని ఉంటున్న అనితకు తమకు తోచినంత సాయం చేస్తూ ఆహారాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. కారులోనే నిద్రపోతూ, రోజంతా అందులోనే కూర్చుంటున్నట్లు వారు పోలీసులకు తెలిపారు.
ఇక, కారును రోడ్డుపై నిలిపి ఉంచినందుకు రెండేళ్లుగా ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు కూడా ఆ కారుకు విధించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనితకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు ఇలా కారులో ఉండటం శ్రేయస్కరం కాదని, స్టేట్ హౌంకు తరలించి ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. కానీ, అందుకు అనిత అంగీకరించకపోవడంతో మరోసారి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆ కారు కూడా ఆమె పేరు మీదే ఉన్నట్లు తెలియడం కొసమెరుపు. దీనిపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు.