ఒక్క ప్రసవంలో ముగ్గురో నలుగురో పుడితేనే ఆశ్చర్యపోయి చూస్తాం. అలాంటిది ఒకే ప్రసవంలో ఒక మహిళ ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చి ఔరా అనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో ఈ అద్భుతం చోటు చేసుకుంది.
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలికి చెందిన హమీలా సీజ్ అనే మహిళ ఇలా ఒకేసారి తొమ్మిది మందికి జన్మనిచ్చి రికార్డు నెలకొల్పింది.
నిజానికి ఆమె కడుపులో తొమ్మిది మంది బిడ్డలున్న సంగతి స్కానింగ్‌లో కూడా తెలియలేదట. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఏడుగురు బిడ్డలున్నట్లే వెల్లడైంది.
ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న డెలివరీ అని.. మాలిలో సరైన వైద్య సౌకర్యాలు లేవని భావించి హమీలా సీజ్‌ను కొన్ని నెలల ముందే మొరాకోకు తీసుకొచ్చారు.
మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో హామీలా కుటుంబానికి రాజకీయ నాయకులు తోడ్పాటు అందించారు. కొన్ని నెలలుగా మొరాకోలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆమెను పర్యవేక్షిస్తూ వస్తోంది.
బుధవారం డెలివరీకి ఏర్పాట్లు చేశారు. ఐతే ఏడుగురు బిడ్డలే అన్న అంచనాతో ప్రసవం చేయగా.. అదనంగా ఇంకో ఇద్దరు బిడ్డలు ఉండేసరికి షాకవడం వైద్యుల వంతైంది.
మొత్తం తొమ్మిది మందిలో ఐదుగురు అమ్మాయిలు కాగా.. నలుగురు అబ్బాయిలని వెల్లడైంది.
తల్లితో పాటు బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
ఇలా ఒకే కాన్పులో ఇంతమందిని ప్రసవించిన సందర్భాల్లో అందరూ ఆరోగ్యంగా ఉండటం, మున్ముందు సాధారణ ఆరోగ్య స్థితిలో కొనసాగడం అరుదు. రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు ఆస్కారం ఉంది. మరి హామీలా పిల్లల సంగతి ఏమవుతుందో చూడాలి.
ఇలా ఒకే ప్రసవంలో తొమ్మిదిమందికి జన్మనివ్వడం ఇది తొలిసారి కాదు.