2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రచారంలో చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా తన ఉగ్రరూపం చూపించారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు అంటూ టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ఈ రోజు టీడీపీ ఎంపీలతో భేటీ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదని, మారిన చంద్రబాబును చూస్తారని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మారరు అనే అపవాదును చెరిపేస్తానని, ఇకపై పాత చంద్రబాబు కనిపించడని అన్నారు. ఇదేదో మాటవరసకు చెబుతున్నది కాదని, ప్రత్యక్షంగా చూడబోతున్నారని చెప్పారు. తనను ఎంపీలంతా తరచూ వచ్చి కలవాలని, తాను బిజీగా ఉన్నా ఎంపీలతో మాట్లాడతానని అన్నారు.
గత ఐదేళ్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేశారని, గొంతుమీద కత్తి పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారని ఎమోషనల్ అయ్యారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గకుండా పార్టటీ కోసం నిలబడ్డారని భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై ప్రతి అంశాన్ని తాను వింటానని, తానే స్వయంగా చూస్తానని చెప్పారు. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుందని, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎవరి పరిధిలో వారు పనిచేయాలని, ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు తనకు ఎంతో మనోవేదన కలిగించాయని భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింని అన్నారు. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తానని, ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.