సొంత ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వ్యవహార శైలిపై నాని మండిపడ్డారు. కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగం తీరు మారకుంటే సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సమావేశానికి కలెక్టర్, సంబంధిత అధికారులు గైర్హాజరు కావడంపై నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తదుపరి సమావేశానికి వారు హాజరు కాకుంటే ఎంపీటీసీ, జడ్పీటీసీలంతా కలిసి సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
అసలు సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశం కలెక్టర్కు ఉందా? లేదా? అని నాని ప్రశ్నించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతంలో ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వెళ్లడంతో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరవుతున్నారని, అదే విధంగా నియోజకవర్గాలకు సంబంధించిన జడ్పీటీసీ (ZPTC) సభ్యులు, ఎమ్మెల్యేలు (MLAs) వాళ్ల సమస్యలను ఎవరికి వివరించాలని నాని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లా కూర్చోడానికి వచ్చామనుకుంటున్నారా అని నిలదీశారు. గతంలో కూడా ఈ సమావేశాలకు జిల్లా కలెక్టర్, అధికారులు ఎవరూ రాకపోవడంపై నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.కలెక్టర్ ఈ సమావేశాలకు వచ్చే ఉద్దేశం లేకపోతే చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసారి సమావేశానికి కలెక్టర్ రాకుంటే జడ్పీటీసీలు, ఎంపీటీసీ లు అందరం కలిసి సీఎం ఇంటికి వెళతామని, బయట కూర్చుని నిరసన తెలుపుతామని నాని వార్నింగ్ ఇచ్చారు.