విశ్వనటుడు కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఎంత పెద్దనటుడు.. అనే విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న కోర్టు.. ఆయన కర్ణాటక ప్రజలకు క్షమాప ణలు చెప్పి తీరాల్సిందేనని పేర్కొంది. దేశంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా.. ఎన్ని కీర్తులు సంపాయించు కున్నా.. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా.. ఒక రాష్ట్ర చరిత్రను వక్రీకరించేలా వ్యవహరించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది.
తాజాగా ఈనెల 5న కమల్ హాసన్ నటించిన `థగ్ లైఫ్` సినిమా విడదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమొషన్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కర్ణాటకలో కాక రేపింది. ఆయన చరిత్ర తెలుసుకోవాలని.. ఏకంగా సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఇక, కన్నడ సంఘాలు మరింత హెచ్చరికలు జారీ చేయ డంతోపాటు కమల్ ఫొటోలను పోస్టర్లను కూడా.. తగుల బెట్టారు.
మరోవైపు.. థగ్ లైఫ్ సినిమాను విడుదల కానీయబోమని.. కమల క్షమాపణలు చెప్పాలని కర్ణాటక భాషా సంఘాలు తేల్చి చెప్పాయి. దీంతో మరోసారి స్పందించిన కమల్.. తాను క్షమాపణలు చెప్పబోనని.. తాను ఉన్నదే మాట్లాడానని నాలుగు రోజుల కిందట తేల్చి చెప్పారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మరింత దుమారం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పే వరకు థగ్ లైఫ్ సినిమాను విడుదల కానీయబోమని చెప్పాయి.
దీంతో హుటాహుటిన కమల్.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. థగ్ లైఫ్ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని.. ఈ సినిమా విడుదలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. అయితే.. విషయాన్ని ఆరా తీసిన హైకోర్టు.. కన్నడిగుల మనసు నొప్పించేలా.. వ్యాఖ్యానించడం సరికాదని కమల్‌ను హెచ్చరించింది. “ఎన్ని కారణాలు చెప్పినా.. మేం పరిశీలించలేం. క్షమాపణలు తప్ప మరోమార్గం లేదు“ అని తేల్చి చెప్పింది. దీనిపై కమల్ ఎలా స్పందిస్తారో చూడాలి.