ఏపీ సీఎం జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై తాజాగా ఆయన కుమార్తె సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గత 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య జరిగింది. పులివెందులలోని సొంత ఇంట్లో ఆయన రక్తపు మడుగులో పడిఉన్న పరిస్థితిలో గుర్తించారు. తొలుత జగన్ సొంత మీడియా గుండె పోటుతో మృతి చెందారని ప్రచారం చేసింది. అయితే.. తర్వాత.. కొన్ని గంటలకు ఆయన హత్యకు గురయ్యారనే విషయం ప్రపంచానికి తెలిసింది.
ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నానా యాగీ చేశారు. అయితే.. అప్పటి సీఎం చంద్రబాబు మాత్రం దీనిపై సిట్లు వేశారు. విచారణ ప్రారంభించారు. ఇంతలో ప్రభుత్వం మారింది. దీంతో తమకు న్యాయం జరుగుతుందని వివేకా కుటుంబం భావించింది. కానీ, ఇప్పటి వరకు కేసులో ఎవరు నిందితులో కూడా గుర్తించలేక పోయారు. పైగా జగన్ సీఎం అయ్యాక.. ఈ కేసును సీబీఐకి ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకా కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో సీబీఐ ఈ కేసును టేకప్ చేసింది. అయితే.. ఇప్పటి వరకు దీనిలో ఎవరు దోషులు అనే విషయాన్ని మాత్రం గుర్తించలేక పోయారు. ఈ పరిణామంపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన సునీత.. తాజాగా మరోసారి తన ఆవేదనను పంచుకున్నారు. ‘‘ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదు. ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని కలిస్తే.. కడప, కర్నూల్లో ఇలాంటి ఘటనలు సాధారణం అన్నారు. అయ్యిందేదో.. అయ్యింది.. నీ పోరాటం ఆపేయి.. లేదంటే నీ పిల్లలపై ప్రభావం చూపుతుందని కొంతమంది సూచించారు.
నేను ఆశ్చర్యపోయాను. ఏది సరైందన్న ఆలోచనలో పడ్డాను. నా పిల్లల గురించి ఆలోచిస్తూ స్వార్థపరురాలిగా ఉండిపోవాలా అనిపించింది. నేను రాజకీయవేత్తను.. సామాజిక కార్యకర్తను కాదు. మానాన్న ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి. అంతటి వ్యక్తికే ఇలా జరిగితే… సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి మరణించాడు. విచారణ ఆలస్యమైతే.. రేపటి రోజున సాక్షులు కూడా ముందుకు రారు. న్యాయం కోసం ఇంకెంత కాలం నిరీక్షించాలి’’ అని సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఈ కేసులో సునీతను ఓ ఉన్నతాధికారి హెచ్చరించడం మరింత సంచలనంగా మారింది. ఇది సీఎం జగన్కు తీవ్రంగా సెగపెట్టే అంశమే. మరీ ముఖ్యంగా తన బాబాయి హత్యను తన ప్రభుత్వమే తేల్చలేక పోతే.. ఇక, రాష్ట్ర ప్రజలను ఎవరు కాపాడుతారు? అనే విషయానికి ఆయన సమాధానం చెప్పితీరాలి. కానీ, ఆల్ ఈజ్ వెల్ అనే తరహాలో తన పాలన ఉందని.. పైగా ఎక్కడ నేరం జరిగినా.. వెంటనే స్పందిస్తున్నామని చెబుతున్న ఆయన.. సొంత బాబాయి కేసునే తేల్చుకోలేక పోతున్నారనే విషయం సంచలనంగా మారింది. ఇప్పటికే రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చిన సునీత.. తన ఆవేదనను వెల్లడించారు. మరి జగన్కు మనసు లేదా? ఉండి కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదా? అనేది ప్రధాన ప్రశ్న.