వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఈ సారి టీడీపీ విజయం దక్కించుకుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. “ఇప్పటి వరకు వైనాట్(ఎందుకు కాదు) పులి వెందుల అన్నా. కానీ, ప్రజల్లో వచ్చిన మార్పు చూసిన తర్వాత.. ప్రజల్లో వస్తున్న ఆలోచనలను చూసిన తర్వాత.. వైకాంట్(ఎందుకు కాకూడదు) పులివెందుల. అక్కడ కూడాగెలిచి తీరుతాం“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పులివెందులలో జగన్ను చిత్తుచిత్తుగా ఓడించాలని అక్కడి ప్రజలకు పిలుపునిస్తున్నానని చెప్పారు.
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన `ప్రజాగళం` ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పులివెందులలో జగన్కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. బాబాయిని చంపినందుకా? చెల్లెళ్లను రోడ్డున పడేసి.. న్యాయం కోసం కొంగు చాపుతున్నందుకా? ఎందుకు వేయాలని నిలదీశారు. నెల్లిమర్లలో జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు ఫైరయ్యారు. “వైనాట్ 175 అంటున్నాడు. ఎందుకు ఇవ్వాలని ఆయనను ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఇంటికీ గొడ్డళ్లను పంపించి.. బంధువులను చంపేందుకు నీకు అధికారం కావాల్నా“ అని నిలదీశారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో కూడా తనపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 22 కేసులు పెట్టారని.. ఇప్పుడు ఇంకో రెండు మూడు కేసులు పెట్టినా ఆశ్చర్యం లేదన్నారు. అయినా.. తాను ఎవరికీ భయపడేది లేదన్నారు. ఈ సైకోకి అసలే భయపడనని చెప్పారు. జగన్ గెలుపుపై ఆయన కుటుంబంలోనే ఆశలు లేవని చెప్పారు. వైసీపీ నాయకులు ఎన్నికలు అయిపోయిన తర్వాత.. తలో దిక్కుకు పారిపోతారని.. ఎద్దేవా చేశారు.
కేసుల్లో పుట్టి.. కేసుల్లో పెరిగిన వారికి.. 40 ఏళ్ల రాజకీయంలో ఒక్క మచ్చ కూడా లేని తనకు పోలిక ఎక్కడదని చంద్రబాబు ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నామని.. కానీ.. జగన్ వచ్చి అన్నింటినీ మింగేశాడని విమర్శించారు. విశాఖలో రుషి కొండను బోడి కొండ చేశాడని, రామతీర్థంలో రాముడి తల నరికేయించాడని.. వీటిని ప్రశ్నిస్తే.. అర్ధరాత్రి పూట గోడలు దూకి వచ్చి.. తమను అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు.