ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది అన్న విషయంపై ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ సారి వార్ వన్ సైడ్ అని ఇరు పార్టీల నేతలు ధీమాగా చెబుతున్నప్పటికీ…చాలా చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు అని, గత ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ మద్దతిచ్చినట్లు ఈసారి చంద్రబాబుకు రేవంత్ మద్దతిస్తారని పుకార్లు వచ్చాయి. అయితే, తనకు చంద్రబాబు అంటే గౌరవం ఉందని, కానీ, గురు శిష్యుల బంధం కాదని రేవంత్ క్లారిటీనిచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఏపీలో కాబోయే సీఎం ఎవరు అన్న విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఎవరు సీఎం అయినా వారితో సత్సంబంధాలుంటాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యలను ఏపీకి కాబోయే సీఎంతో కూర్చొని చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు.
ఎన్నికల్లో టిక్కెట్ల ఇచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ రాజకీయాలపై రేవంత్ మాట్లాడారు. కేసీఆర్‌కే దిక్కులేదు ఇక మల్లారెడ్డిని ఎవరు పట్టించుకుంటారని చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని, సగం మంది కాంగ్రెస్‌లోకి, సగం మంది బీజేపీలోకి వెళతారని జోస్యం చెప్పారు. ఎన్డీఏ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు.
యూటీ గురించి మాట్లాడే వారికి మెదడు తక్కువగా ఉన్నట్లేనని, యూటీ ఎప్పుడు చేస్తారు… ఎవరు చేస్తారు? తెలుసుకోవాలని కేటీఆర్ కు చురకలంటించారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, హైదరాబాద్‌ను సెకండ్ క్యాపిటల్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్ శాఖలో కొందరు కావాలనే పవర్ కట్ చేయడం వల్లే కొన్నిచోట్ల విద్యుత్ కోతలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కొందరితో ఇలాంటి తలతిక్క పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ వేవ్ లేదని, 9 నుంచి 13 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతో మాత్రమే పోటీ అని, జాతీయస్థాయిలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని జోస్యం చెప్పారు.