ఈ రోజు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి అంగరంగవైభవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్రలో త్వరలో రామరాజ్యం రాబోతోందని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలించిన శ్రీరాముడి గురించి, త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామని అన్నారు. పాలకులు తమ కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని, వారి సుఖసంతోషాలకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.
మరోవైపు, జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు ఈ రోజు కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఈ ఇద్దరు నేతలు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ పెడన బస్టాండ్ సెంటర్ లో జరగనుంది. రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్ లో వారాహి విజయభేరి సభ నిర్వహించనున్నారు.