ఏపీలో రాజకీయాలు మారతాయా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? అంటే.. ఔననే అంటున్నాయి.. ఢిల్లీ రాజకీయ వర్గాలు. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు.. అక్కడి ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ, బెంగాల్, నిన్న మొన్నటి వరకు పుదుచ్చేరిల్లో గవర్నర్ల దూకుడు అందరికీ తెలిసిందే. ఇక, తెలంగాణలోనూ కొన్నాళ్ల కిందట.. గవర్నర్ తమిళి సై.. దూకుడుగానే వ్యవహరించారు. కేసీఆర్ కరోనా బారిన పడిన సమయంలో ప్రభుత్వ వ్యవహారాలను ఆమే స్వయంగా చూసుకున్న విషయం తెలిసిందే.
అయితే.. ఏపీ విషయానికి వచ్చేసరికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాత్రం దూకుడు చూపించలేకపోతున్నారనే వాదన కొన్నాళ్లుగా బీజేపీ నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు.. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా కొట్టివేతలకు, ప్రభుత్వంపై విమర్శలకు దారితీస్తున్నాయి.
కొన్నింటిలో గవర్నర్ జోక్యం చేసుకుని నిలువరించే ప్రయత్నం చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆయన మౌనంగా ఉండడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో బీజేపీ నేతలు సైతం గవర్నర్ను కలిసి విన్నవించినా.. సదరు అంశాలపై ఆయన చర్యలు తీసుకోలేక పోయారు.
దీంతో జగన్ పాలనపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు విమర్శలుగా నే ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ను మారుస్తారా? జగన్ దూకుడుకు చెక్ పెట్టగలిగే బలమైన వ్యక్తిని ఇక్కడ నియమిస్తారా? అనే చర్చ ఇటీవల రాజకీయ వర్గాల్లోను, ముఖ్యంగా బీజేపీ వర్గాల్లోనూ హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ను ఢిల్లీ రావాలంటూ.. కేంద్ర హోం శాఖ నుంచి ఉత్తర్వులు రావడం ఆసక్తిగా మారింది.
వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకోవాలని.. కుదిరితే అధికారం, లేదా ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే.. జగన్ దూకుడుకు అడ్డుకట్టవేయగలిగే.. గవర్నర్ అవసరమని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఏపీపై దృష్టి పెట్టారని.. తెలుస్తోంది. కేంద్రం ఇస్తున్న నిధులను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్న వైనాన్ని రాష్ట్రనేతలు ప్రధానంగా చర్చిస్తున్నారు. దీనిని అడ్డుకోవాలంటే.. గవర్నర్ వల్లే సాధ్యమని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీలో గవర్నర్ను మార్చడం ద్వారా రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురావడం సాధ్యమవుతుందని తలపోస్తున్న తరుణంలో గవర్నర్ కు ఢిల్లీ పిలుపు రాజకీయంగా ఆసక్తిగా మారడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.